10-11-2025 12:00:00 AM
16న ఆదిరాజు వీరభద్రరావు జయంతి :
తెలంగాణ వైతాళికుల్లో ఆదిరాజు వీరభద్రరావు ఒకరు. నూరేళ్ల క్రితమే ఆయన పరిశోధన రంగంలో ప్రతిభామూర్తి. విజ్ఞానచంద్రిక గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా, లక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్య వస్థాపక సభ్యుడిగా, విజ్ఞానవర్ధిని పరిషత్తు సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యుడిగా, సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ వ్యాసకర్తగా ఆయన సేవలు అనన్యసామా న్యం.
భాషా శాస్త్రవేత్తగా ఆయ న కృషి నిరుపమానం. ఆదిరాజు ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో 1890 నవంబర్ 16న జన్మించాడు. తన ఐదేళ్ల ప్రా యంలోనే తండ్రి లింగయ్య కాలం చేయగా, తల్లి వెంకమాంబ ఆయన్ను పెంచింది. ఆదిరాజుకు 11 ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు తనకు మంచి చదువు చెప్పించాలనే ఉద్దేశంతో తల్లి హైదరాబాద్‌లో ఉంటున్న బంధువు రావిచెట్టు రంగారావు ఇంటికి వచ్చింది. తన కుమారుడికి చదువు చెప్పించేందుకు సా యం చేయాలని కోరింది.
అప్పటికే సంతా నం లేని రావిచెట్టు రం గారావుకు ఆదిరాజుపై పుత్ర వాత్సల్యం కలిగింది. అప్పటికే ఆదిరాజు రామాయణం, మహాభారతం, భాగవత గ్రంథాలను చదివి ఉన్నాడు. నాటి పేరెన్నిక గల నిఘంటువు అమర కోశాన్ని కంఠతః పట్టారు. ఎంతో శ్రావ్యంగా పద్యా లు పాడేవారు. ఏదైనా ఒక్కసారి చదివితే గుర్తించుకునేంత ఏకసంథాగ్రాహిగా పేరుండేది. రావిచెట్టు రంగారావు ప్రోత్సాహంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ప్రభుత్వ బడిలో పాఠశాల విద్య పూర్తి చేశాడు.
1901లో రావిచెట్టు రంగారావు స్వయంగా తన ఇంట్లో నెలకొల్పిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి తొలి గ్రంథ పాలకుడిగా ఆదిరాజు వ్యవహరించాడు. అనతికాలంలోనే దానికి అధ్యక్షుడై కొన్నేళ్లపాటు సేవ లందించాడు. 1907లో ఆయనకు లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. 1908లో కొమ ర్రాజు లక్ష్మణరావు స్థాపించిన ‘విజ్ఞాన చంద్రికా మండలి’ హైదరాబాద్ నుంచి మద్రాసుకు తరలించిన సందర్భంలో ఆదిరాజు అక్కడికి వెళ్లి నిర్వహణ బాధ్యతలు చూసుకున్నాడు.
ఈ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు ఎంతోమంది రచయితలు, కవులు, పండితులు, పరిశోధకుల తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయనకు గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం వంటి గొప్ప రచయితల సాంగత్యం లభించింది. ఆయన జీవితంపై కొమర్రాజు లక్ష్మణరావు ప్రభావం ఎంతో ఉంది. లక్ష్మణరావు మార్గదర్శకత్వంలో ఆదిరాజు పరిశోధకుడిగా ఎదిగాడు.
1914లో హైదరాబాద్‌కు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యుడిగా నియమితుడ య్యాడు. తర్వాత కొంతకాలానికి తాను చదువుకున్న చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో తెలుగు బోధకు డిగా చేరాడు. తర్వాత నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పాఠాలు బోధించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా సేవలందించిన మర్రి చెన్నారెడ్డి ఈయన శిష్యుల్లో ఒకరు.
రచనా వ్యాసాంగం
1921లో ఆదిరాజు తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసం కోసం ‘ఆంధ్ర పరిశోధక మండలి’ స్థాపించి, ఆ సంస్థకు ఏళ్లపాటు కార్యదర్శిగా సేవలందించాడు. ఆ సమయంలో ఆదిరాజు తెలంగాణ ప్రాంతంలోని ఎన్నో చారిత్రక ప్రదేశాలు, శిలా శాస నాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించాడు. ఆయనకు గడియారం రామకృష్ణశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ సహకరించారు. వారంతా సుదీర్ఘ కాలం పాటు వాటిపై పరిశోధన చేసి ‘తెలంగాణ శాసనాలు’ పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించారు.
అలాగే కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును పాలించిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. ఇదే ఒరవడిలో తెలంగాణ ప్రాంతంలోని తొమ్మిది జిల్లాల చరిత్రను గ్రంథస్థం చేశాడు. భాగ్యనగరం చరిత్రపై అమూల్యమైన గ్రంథాన్ని వెలువరించాడు.
ఆదిరాజు రచనల్లో ‘ప్రాచీనాంధ్ర నగరములు’, ‘లలిత కథావళి’, ‘రత్నప్రభ’, ‘జీవిత చరిత్రలు’, ‘జీవిత చరితావళి’, ‘మిఠాయి చెట్టు’, ‘సీతాబ్ ఖాన్, ‘నవ్వుల పువ్వులు’, ‘చిత్రశాకుస్తలము’, ‘తెలంగాణము’, ‘మన తెలంగాణము’, ‘చైతన్యము’, ‘జీవిత చరిత్రలు’ వంటివి జగత్ప్రసిద్ధం. ఆయన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం లో 50 వ్యాసాల వరకు రాశారు. అప్పటివరకు తెలుగు పాఠకులకు పరిచయం లేని గ్రీకు పురాణ కథలను రాసి అబ్చురపరిచారు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన మొదటివాడిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించాడు.
గ్రీకు పురాణ గాథలు, షితాబుఖాన్ గ్రంథాల వెనుక
‘గ్రీకు పురాణ గాథలు’ రాయడానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉందిన ఆదిరాజు చెప్తుండేవాడు. తాను పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు తన స్నేహితుడు ప్రాచీన గ్రం థాల ప్రస్తావన తీసుకొచ్చాడట. ఆ మాటల్లోనే గ్రీకు గాథల గురించి ఇద్దరు స్నేహితు లు చర్చించారు. ఆ గ్రంథాలపై అధ్యయనం చేయాలనే ఉత్సుకతతో ఆదిరాజు ఎన్నో గ్రంథాలయాలకు వెళ్లాడు. గ్రీకు పురాణగాథల కోసం అన్వేషించాడు. కానీ, ఎక్కడా ఆయనకు సమాచారం లభించలేదు.
తన రచనా వ్యాసాంగం ప్రారంభించిన తర్వాత ఎంతో పరిశోధన చేసి ‘గ్రీకు పురాణగాథలు’ రాశాడు. అలాగే ఆయన మరో రచన షితాబుఖాన్ (సీతాపతిరాజు) చరిత్ర రాయడం వెనుక ఒక కారణం ఉంది. ఆ రాజు హిం దూ చరిత్రకారులతో మహమ్మదీయుడిగా, మహమ్మదీయ చరిత్రకారులతో హిందువుగా గ్రంథాల్లోకి ఎక్కి నిరాదరణకు గుర య్యాడు.
కొమర్రాజు లక్ష్మరావు ఒక ప్రాచీన శాసనాన్ని గుర్తించగా, దానిలో షితాబుఖాన్ చరిత్ర బయటపడింది. దాని ఆధారం గా ఆదిరాజు ‘షితాబుఖాన్ చరిత్ర’ గ్రంథా న్ని వెలువరించాడు. ‘షితాబ్’ అంటే అభ్యుదయమని, ‘ఖాన్’ అంటే శూరుడని తేల్చా డు. అంతేకానీ.. సీతాపతి ముమ్మాటికీ మహమ్మదీయుడు కాదని తన గ్రంథంలో నిష్కర్షగా నిర్ధారించాడు.
సౌమ్యుడిగా పేరు
ఆదిరాజుకు అప్పటి ప్రముఖుల్లో అత్యం త సౌమ్యుడనే పేరుండేది. ఎదుటివారిలో దోషాలను కాకుండా, ఆయన కేవలం సుగుణాలను మాత్రమే ఎంచిచూసేవాడని ప్రతీ తి. తనలో లోపాలను తాను కూడా క్షమించుకోలేని నిబద్ధతతో ఉండేవాడు. ఏదైనా తప్పు జరిగితే దానిపై సమగ్రమైన విచారణ చేసేవాడు. మరోసారి ఆ తప్పు జరగకుండా చూసుకునేవాడు. ఎవరితోనైనా మాట కలిపేవాడు. ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడగలిగేవాడు.
నిజాం పాలనలో ఉ ర్దూ ప్రాభవం కొనసాగుతుండేది. విద్యాలయాలన్నింటిలోనూ ఉర్దూ మీడియమే నడుస్తుండేది. తెలుగు మాట్లాడేవారు ఎందరున్నా, తెలుగుకు పెద్దగా ఆదరణ, ప్రోత్సా హం ఉండేది కాదు. తెలుగుకంటే.. ఇంగ్లిష్ విద్యకు కొంతవరకు ప్రాధాన్యం ఉండేది. అలాంటి సమయంలో శ్రీకృష్ణ దేవారాయాంధ్ర భాషా నిలయంలో ఆదిరాజు ప్రభృతులు అశేషమైన తెలుగు గ్రంథాలను సేకరించారు.
భాషా నిలయంలో విస్తృతంగా సాహిత్యపరమైన సదస్సులు, సమా వేశాలు నిర్వహించేవారు. తెలుగు మాట్లాడితేనే పెద్ద తప్పు, నేరమని భావించిన కాలం లో మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, మందుముల నరసింగరావు, డాక్టర్ పండిత రామస్వామి నాయు డితో కలిసి ఆదిరాజు తెలుగు భాష వికాసం కోసం ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించారు. ఆ సంస్థే తర్వాత ‘ఆంధ్ర మహాసభ’గా రూపాంతరం చెందింది.
దీనికి అనుబంధంగా ‘ఆంధ్ర పరిశోధక మండలి’ అని మ రో సంస్థను నెలకొల్పారు. ఖండవల్లి బాలేం దు శేఖరం ‘విస్మృత సామ్రాజ్యములు’, మాడపాటి హనుమంతరావు ‘తెలంగాణ ఆంధ్రోద్యమము’, ఖండవల్లి లక్ష్మీరంజనం ‘ఆంధ్రుల సాహిత్య చరిత్ర సంగ్రహము’ వంటి గ్రంథాల ప్రచురణలో ఆదిరాజు ముఖ్యభూమిక పోషించారు. తెలంగాణ ప్రాంతంలో ఏ సాహిత్య సంస్థ, ఏ సామాజిక ఉద్యమానికి అంకురార్పణ జరిగినా ఆదిరాజు ప్రత్యేక ఆహ్వానితుడు.
ఆయనకు ఆడంబరాలు గిట్టవు. కుల, మత, ప్రాంత, వర్గభేదాలకు అతీతంగా ఆయన జీవనయానం సాగింది. జీవితకాలం ఆయన ఆ్ంర ధా భాష వికాసానికి కృషి చేశాడు. తన సర్వశక్తులొడ్డి తెలుగు ప్రభలు వెలిగించేందుకు పనిచేశాడు. తెలంగాణ ప్రాంతంలో రాజవంశాల చరిత్ర, దర్శనీయ ప్రాంతాలు, శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలు శ్రమించాడు.
తన ప్రతి భా పాండిత్యంతో, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు పొందిన ఆదిరాజు వీరభద్రరావు 1973 సెప్టెంబర్ 28న తన 82 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచాడు. ఆయన రచనలు ఇప్పటికీ ప్రామాణిక గ్రంథాలు. తెలంగాణ చరిత్రను ఆచంద్రతారార్కం పదిలపరిచిన ఆయన కృషి నిత్యస్మరణీయం.
శ్రీవిద్య