calender_icon.png 13 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్యాబోధన అందించాలి

13-11-2025 07:42:43 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామపంచాయతీ తేలిగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ, తరగతి గదులు, రిజిస్టర్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ఆహారం తయారీ సమయంలో పరిశుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎ.ఐ. పద్ధతిలో విద్యార్థులకు బోధించడం ద్వారా పఠన సామర్థ్యం పెంపొందుతుందని తెలిపారు.

అనంతరం గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి.శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి కవిత, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.