calender_icon.png 13 November, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు అండగా నిలిచిన ప్రజా ప్రభుత్వం

13-11-2025 07:22:24 PM

* వరదలో బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటు

* గతంలో ఫోటోలకు పరిమితమైన నేపథ్యం

* వరద బాధితులకు ప్రభుత్వం సహాయం

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం సత్వరమే ఆర్ధిక సహాయం అందిచడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. గురువారం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణలతో కలసి పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ మొంథా తుఫాన్ కారణంగా హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రజల ఇళ్లకు నష్టపరిహారం మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లను ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, బాధితులకు అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇచ్చిన మాట ప్రకారం అనతికాలంలోనే  వరద సహాయం అందజేశారు. హనుమకొండ జిల్లా కు రూ. 7.03 కోట్లు, వరంగల్ జిల్లాకు రూ. 5.05 కోట్లు, మొత్తం రూ. 12.08 కోట్ల వరద సాయం మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

ప్రత్యేకంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 48 కాలనీలు నీట మునిగాయి. మొత్తం 4,790 ఇళ్లు వరద నీటిలో దెబ్బతిన్నాయి. ఆ నష్టానికి ప్రభుత్వం రూ. 7,18,50,000 నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఈ సంఖ్యలు కేవలం అంకెలు కాదు ఇవి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. అక్టోబర్ 31న వర్షాలు పడితే, నవంబర్ 11 నాటికే నిధులు నేరుగా మంజూరు చేయడం ఇది మా ప్రభుత్వ స్పందన ఎంత వేగంగా ఉందో చెప్పే సాక్ష్యం అని తెలిపారు. మునుపటి ప్రభుత్వాల కాలంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కేవలం పేపర్ ప్రకటనలతోనే హామీలు ఇచ్చి, ప్రజల కష్టాలను మర్చిపోయారని అన్నారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు, చేతలతో చూపిస్తుందని అన్నారు. ఇది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, ప్రజలకు న్యాయం చేయాలనే, వారి పక్కన నిలబడాలనే ప్రజా ప్రభుత్వం ధృఢసంకల్పం అని అన్నారు.

జిల్లా ప్రజా ప్రతినిధులు అందరం కలిసికట్టుగా పని చేసి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాం తెలిపారు. గతంలో వరదలలో సహాయం పేరిట దోచుకున్న పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. జాగృతి జనంబాట పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి బయలుదేరిన కవిత పై మండిపడ్డారు. మీ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అని ఎమ్మెల్యే నాయిని అన్నారు. వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం బాధాకరం తప్పకుండా ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి శ్రీనివాస్ రావు,విగ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.