06-07-2025 01:08:41 AM
తెలంగాణ రాజకీయాల్లో ఈమధ్య వింత సంస్కృతి కనబడుతోంది. అజ్ఞాత ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలుస్తున్నాయి. రాత్రికి రాత్రే వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీ సభ పెట్టినప్పుడు లేదా ఢిల్లీ నుంచి ఆ పార్టీ అగ్రనాయకులు తెలంగాణకు వచ్చిన సందర్భాల్లో హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ వారిని, వారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు వెలవడంపై జనాల్లో చర్చ జరుగుతోంది.
ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో..అప్పటి నుంచే ఆ ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రధాన కూడళ్లలో వెలుస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీతోనే ఆగలేదు. ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనాయకత్వం వచ్చినప్పడు కూడా తెలంగాణకు ఏం చేశారు? ఏం ఇచ్చారంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ప్రత్యక్షం కావడంపై జనాల్లో చర్చ జరుగుతున్నది. ఫ్లెక్సీలు పెట్టేదెవరో ధైర్యంగా ఊరు, పేరు, పార్టీ పేరు రాయకుండా ఊరికే పెట్టడమెందుకనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.
రమేశ్ మోతె