01-01-2026 01:16:01 AM
నిర్మల్ పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు రాసం శ్రీధర్
నిర్మల్, డిసెంబర్31 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో అర్హులైన పాత్రికేయులకు సత్వరమే ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ తొమ్మిది రోజులు చేసిన ఆందోళనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు నిర్మల్ పాత్రికేయుల సంఘం అధ్యక్షులు రాసం శ్రీధర్ తెలిపారు. పాత్రికేయుల డిమాండ్ ప్రభుత్వానికి అధికారులకు తెలపడం వల్ల వారు దాన్ని పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో బుధవారం నుంచి తాత్కాలికంగా దీక్షలు విరమిస్తూ తీర్మానం చేసినట్టు తెలిపారు.
మరోవైపు సాధ్యమైనంత త్వరగా తమకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని మరో మారు ప్రెస్ క్లబ్ విన్నవించింది. లేని పక్షంలో తమ నిరసనలను ఈసారి మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేసింది. తొమ్మిది రోజుల పాటు కొనసాగిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన పార్టీలు, సంఘాలు, నాయకులు, బాధ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపింది.