12-01-2026 03:32:10 AM
పెద్దపల్లి/గోదావరిఖని, జనవరి 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. పట్టాల పంపిణీ అనంతరం మంత్రులు వేదిక నుంచి దిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య వేదికపైనే వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. వాగ్వాదం క్రమంగా తోపులాటకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనతో కొంతసేపు సభా కార్యక్రమం అంతరాయం ఏర్పడింది. ఘర్షణకు కారకులైన వారిపై ఎమ్మెల్యే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.