17-01-2026 10:51:07 AM
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ర్యాలీకి(BRS Rally) అనుమతి లేదని నార్త్ జోన్ జాయింట్ సీపీ వెల్లడించారు. బీఆర్ఎస్ ర్యాలీకి వెళ్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ తలపెట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి(Secunderabad District Sadhana Samiti) పేరుతో ర్యాలీకి అనుమతి అడిగారని పోలీసులు తెలిపారు.
4 వేల మంది ర్యాలీలో పాల్గొనే అవకాశముందని వెల్లడించారు. ర్యాలీ వల్ల నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశముందని పోలీసులు సూచించారు. శాంతిభద్రతల సమస్య దృష్ట్యా ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని పోలీసులు వివరించారు. నల్లజెండాలతో వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అటు తెలంగాణ భవన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.