calender_icon.png 17 January, 2026 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులు, నాళాల బాధితులకు టీడీఆర్ భరోసా!

17-01-2026 03:48:04 AM

  1. భూమి కోల్పోయేవారికి 200 నుంచి 400 శాతం వరకు అభివృద్ధి హక్కులు
  2. ఎఫ్‌టీఎల్‌లో భూమి పోతే 200%.. బఫర్ జోన్లో 300%.. నాళాల విస్తరణకు 400%..
  3.   10 అంతస్తులు దాటే భవనాలకు ‘టీడీఆర్’ వినియోగం తప్పనిసరి
  4. కీలక సవరణలతో ‘జీవో నెం.16’ జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 16 (విజయక్రాంతి): నగరాభివృద్ధిలో భాగంగా చెరువులు, నాళాల పరిరక్షణ, అభివృద్ధి పనుల్లో తమ ఆస్తులు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. మౌలిక వసతుల కల్పన కోసం భూమిని త్యాగం చేసే వారికి అండగా నిలిచేలా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్)విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. చెరువుల సుందరీకరణ, నాళాల విస్తరణలో భూమి కోల్పోయిన వారికి.. వారి భూమి విలువకు అనుగుణంగా 200 శాతం నుంచి ఏకంగా 400 శాతం వరకు టీడీఆర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో నెం.16 ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు, బాధితులకు న్యాయం జరగనుంది.

కొత్త స్లాబ్స్ ఖరారు.. ఎవరికి ఎంతంటే

టీడీఆర్ మంజూరు విషయంలో ప్రభు త్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. సరైన రెవెన్యూ పత్రాలు, యాజ మాన్య హక్కులు ఉండి, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం భూమిని అప్పగించే వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో... చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం పరిధిలో పట్టా భూమిని కోల్పోతే, ఆ విస్తీర్ణానికి 200 శాతం టీడీఆర్ ఇస్తారు. చెరువు బఫర్ జోన్ పరిధిలో భూమిని కోల్పోతే 300 శాతం టీడీఆర్ వర్తిస్తుంది. నాళాలు, బఫర్ జోన్ వెలుపల, బఫర్ జోన్ దాటి న తర్వాత ఉన్న భూములు లేదా నాళాల వెడల్పు, అభివృద్ధి కోసం సేకరించే ప్రైవేట్ భూములకు అత్యధికంగా 400 శాతం టీడీఆర్ మంజూరు చేస్తారు. దీనివల్ల భూయ జమానులకు నగదు పరిహారం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, తక్షణమే మార్కెట్ విలువ కలిగిన బాండ్ల రూపంలో లబ్ధి చేకూరుతుంది.

హైరైజ్ బిల్డింగ్స్‌లో 10% టీడీఆర్ మస్ట్..

భూమి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్ బాండ్లకు మార్కెట్‌లో డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగరంలో 10 అంతస్తులకు మించి నిర్మించే ఏ భవనంలోనైనా, మొత్తం బిల్టప్ ఏరియాలో 10 శాతం విస్తీర్ణానికి సరిపడా టీడీఆర్ బాండ్లను బిల్డర్లు తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు బిల్డింగ్ రూల్స్‌లో సవరణ చేసింది. ఈ నిబంధన వల్ల భూనిర్వాసితులు తమ దగ్గరున్న టీడీఆర్ సర్టిఫికెట్లను బిల్డర్లకు అమ్ముకుని సులభంగా సొమ్ము చేసుకునే అవకాశం కలుగుతుంది.

పారదర్శకతకు పెద్దపీట.. వేగంగా ప్రాజెక్టులు..

గతంలో టీడీఆర్ మంజూరు, వినియోగం, బదిలీ ప్రక్రియల్లో ఉన్న అస్పష్టతలను తాజా జీవో ద్వారా ప్రభుత్వం తొలగించింది. నగరాల్లో ఫ్లైఓవర్లు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునికీకరణ, రోడ్ల విస్తరణ వంటి పనులకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారుతోంది. భూమికి బదులు డబ్బు చెల్లించాలంటే ప్రభుత్వానికి వేల కోట్లు అవసర మవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీఆర్ విధానాన్ని సరళీకృతం చేయడం ద్వారా అ టు ప్రభుత్వానికి నిధుల ఆదా, ఇటు భూయజమా నులకు న్యాయం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయం పెరిగి, టీడీఆర్ లావాదేవీలు పారదర్శకంగా జరగనున్నాయని, తద్వారా హైడ్రా, మూసీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతాయని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి.