17-01-2026 10:30:58 AM
రూ 1 కోటి 50 లక్షలతో సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్, (విజయక్రాంతి): ప్రజల అవసరాన్ని బట్టి అభివృద్ధి పనులను వేగవంతంగా చేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముడా నిధులు రూ.1 కోటి 50 లక్షలతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ, ఆధునిక వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులకు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యానికి గురైన మినీ ట్యాంక్ బండ్‌ను నగరానికి ఆభరణంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, నగర సౌందర్యం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ సుందరీకరణ పనులను రూపకల్పన చేశామని అన్నారు. వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, కేవలం రోడ్లు, భవనాలే కాకుండా ప్రజలకు విశ్రాంతి, వినోదం, వ్యాయామానికి అనువైన ఓపెన్ స్పేస్‌లు కూడా అవసరమని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. అందుకే మినీ ట్యాంక్ బండ్‌ను భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ పనులు అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గారు, ప్రజల అవసరాలే తమ పాలనకు మార్గదర్శకమని, అభివృద్ధి ఫలాలు ప్రతి వార్డు, ప్రతి ప్రాంతానికి చేరాలన్నదే తమ సంకల్పమని చెప్పారు.
మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పూర్తయితే మహబూబ్‌నగర్ నగరానికి కొత్త గుర్తింపు లభించడమే కాకుండా, ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, నాయకులు సిజే బెనహార్, జహీర్, మథీన్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.