17-12-2025 12:00:00 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం, డిసెంబర్ 16, (విజయక్రాంతి):సంఘటిత, అసంఘటిత కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులను పరిరక్షిస్తూ, నూతన హక్కులను సాధించిపెడుతుంది ఎర్ర జెండానేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయం ’శేషగిరిభవన్’లో మంగళవారం జరిగిన కొత్తగూడెం డివిజన్ హమాలీ కార్మికుల సమావేశంలో అయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు, సౌకర్యం వెనుక ఏఐటీయూసీ, సిపిఐ పోరాటం ఉందని, పోరాటాలు సాగిస్తేనే హక్కులు ఏర్పడతాయని అన్నారు.
హక్కుల సాధనకు, పరిరక్షణకు ఎర్ర జెండాపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గరీబ్ పేట, హేమచంద్రాపురం తదితర పంచాయతీల్లో హమాలీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఉంన్నారని, విజ్ఞతతో అలోచించి ప్రజలు, కార్మికులకు పోరాడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. సమావేశం సందర్బంగా రామాంజనేయ కాలనీ సర్పంచి, 12మంది వార్డు సభ్యులు కూనంనేనిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో సత్కరించారు.