05-01-2026 12:00:00 AM
ఎర్రకోట పేలుడు కేసులో విస్తుపోయే వాస్తవాలు
నిందితులు ఒక్కొక్కరి వద్ద రెండు నుంచి మూడు ఫోన్లు
న్యూఢిల్లీ, జనవరి 4 : ఢిల్లీ ఎర్రకోట సమీపంలో గత నవంబర్‌లో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన నిందితులు పాకిస్థాన్ హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించడానికి అత్యంత రహస్య పద్ధతులను పాటించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ‘ఘోస్ట్’ సిమ్ కార్డులు, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ఉపయోగించి, వారు తమ కార్యకలాపాలు సాగించారు. చదువుకున్న వైద్యులే ఈ తరహా ‘వైట్ కాలర్’ ఉగ్రవాదానికి పాల్పడటం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది.
నిందితులు ప్రతి ఒక్కరూ రెండు నుంచి మూడు మొబైల్ ఫోన్లను వాడేవారు. అందులో ఒకటి సాధారణ వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించే ‘క్లీన్’ ఫోన్ కాగా, రెండోది ఉగ్రవాద కార్యకలాపాల కోసం కేటాయించిన ‘టెర్రర్’ ఫోన్. ఇతరుల ఆధార్ వివరాలను అక్రమంగా సేకరించి పొందిన సిమ్ కార్డులను ఈ టెర్రర్ ఫోన్లలో వాడేవారు. ఈ ఫోన్ల ద్వారా పాకిస్థాన్‌లోని తమ యజమానులతో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌ల ద్వారా నిరంతరం టచ్‌లో ఉండేవారని పోలీసులు గుర్తించారు.
టెలికాం శాఖ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో భారత టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లు పనిచేయాలంటే ఫోన్లో తప్పనిసరిగా యాక్టివ్ సిమ్ కార్డు ఉండాలని ఆదేశించింది. ఫోన్ నుంచి సిమ్ తీసివేస్తే ఆటోమేటిక్‌గా ఈ యాప్‌ల నుంచి యూజర్లు లాగ్ అవుట్ అవుతారు. సిమ్ కార్డు లేకుండా యాప్‌లను వాడుతున్న కుట్రలకు అడ్డుకట్ట వేయడమే కొత్త నిబంధన లక్ష్యం. పేలుడుకు ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీ. నిందితులు తొలుత సిరియా, ఆఫ్గనిస్థాన్ వంటి దేశాలకు వెళ్లి యుద్ధంలో పాల్గొనాలనుకున్నారు. అయితే పాకిస్థాన్ హ్యాండ్లర్లు వారిని భారత్‌లోనే ఉండి దాడులు చేయాలని ప్రోత్సహించారు. యూట్యూబ్ ద్వారా పేలుడు పదార్థాల తయారీని నేర్చుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.