05-01-2026 12:00:00 AM
30 మంది గ్రామస్థుల కాల్చివేత
రక్తపాతం సృష్టించిన తిరుగుబాటుదారులు
అబుజా, జనవరి 4: నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో స్థానిక తిరుగుబాటుదారులు ఘోర ఘాతుకానికి పాల్పడ్డారు. శనివారం సాయంత్రం కసువాన్-దాజి అనే కుగ్రామంపై తుపాకులతో విరుచుకుపడి, రక్తపాతం సృష్టించారు. ఈ దాడుల్లో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా అక్కడి ఇళ్లను, స్థానిక మార్కెట్‌ను నిందితులు తగులబెట్టారు. ఈ దాడుల వల్ల గ్రామంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్కరులు కొందరు మహిళలు, పిల్లలను కూడా అపహరించి అడవుల్లోకి తీసుకెళ్లారు.
బాధితుల ఆచూకీ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే తమ గ్రామానికి ఇప్పటివరకు ఎటువంటి రక్షణ దళాలు చేరుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా సాయుధ ముఠాల ఆగడాలు పెరిగిపోయాయి. అడవులను స్థావరాలుగా చేసుకుని ఈ ముఠాలు గ్రామాలపై దాడులు చేస్తున్నాయి. నైజీరియాలో శాంతి భద్రతల సమస్య తీవ్రంగా మారింది. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసి అపహరణకు గురైన వారిని క్షేమంగా తీసుకురావాలని యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది.