ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ఏ పార్టీ అయినా ఫిరాయింపులు ప్రోత్సహిస్తే తప్పే
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, నాయకులు పోటీ పడి మరీ పార్టీలు మారుతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పార్టీ మారితే మూడు నెలల్లో అనర్హత వేటు పడాలి, కానీ అది జరగడం లేదన్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ వద్ద అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఏ రాజకీయ పార్టీ అయినా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే అది తప్పేనని తాను బలంగా నమ్ముతాన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వెంకయ్య నాయకుడు’ పుస్తకావిష్కరణ సభలో వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు పలువురు ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య పోటాపోటీగా సంబాషణలు సాగాయని, ఇద్దరు కలిసి కేంద్రమంత్రులతో భేటీ అవడం సంతోషకరమన్నారు. అయితే రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో అతిగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత 46 ఏళ్లుగా గురువుగా, మార్గదర్శకుడిగా నాలాంటి ఎంతో మంది నాయకులను ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడన్నారు.






