25-01-2026 12:01:46 AM
తీవ్రంగా స్పందించిన ఇరాన్ ప్రభుత్వం
వాషింగ్టన్/ టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్ఠకు చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఆదేశాల మేరకు ‘ఆర్మడా’ నావికాదళం ఇరాన్ దిశగా దూసుకువెళ్తున్నది. ‘అబ్రహం లింకన్’ అనే ఎయిర్‌క్యారియర్‌లో యుద్ధవిమానాలు, క్షిపణులతో హిందూ సముద్ర జలాల్లో ముందుకు సాగుతున్నది. వాయు వ్య దిశగా పరుగులు పెడుతూ అరేబియన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించనున్నది. ఈ పరిణామంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమపై జరిగే ఎలాంటి దాడినైనా, తాము సంపూర్ణ యుద్ధంగానే పరిగ ణిస్తామని హెచ్చరించింది.
తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, సర్వ శక్తులను ఉపయోగిస్తామని ప్రకటించింది. దాడులు పరిమితంగా ఉన్నా లేదా సర్జికల్ స్ట్రైక్ తరహాలో ఉన్నా ఫలితం మాత్రం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో తన సైన్యాన్ని అప్రమత్తం చేసింది. దీంతో సైనికులు ఎప్పుడు యుద్ధం మొదలైనా ఎదురుదాడి చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుని ఉన్నారు.