19-12-2025 12:00:00 AM
రేగొండ, డిసెంబర్ 18 (విజయక్రాంతి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో నమోదైన డబుల్ మర్డర్ కేసులో నిందితుడు కంచరకుంట్ల రాజు @ రాజిరెడ్డికి భూపాలపల్లి ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది.మానసిక అనారోగ్యంతో 04-01-2024న తన తల్లి, పక్కింటి మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.
పోలీసులు పక్కా ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ. శ్రీనివాస్ వాదనలు వినిపించడంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.ఈ కేసు దర్యాప్తులో డీఎస్పీ ఎ. సంపత్ రావు, సీఐలు డి. వేణుచందర్, డి. మల్లేష్, సిహెచ్. కరుణాకర్ రావు, ఎస్‌ఐలు ఎన్. శ్రీకాంత్, కే. రాజేష్, సీడీఓ జ్యోతి, మహిళా పోలీసులు కీలకంగా పనిచేసినందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వారిని అభినందించింది.ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.