11 March, 2026 | 7:04 PM

డీజీపీ శివధర్‌రెడ్డి నియామకం సక్రమమే

10-01-2026 01:43 AM
  1. తీర్పు వెలువరించిన హైకోర్టు
  2. యూపీఎస్సీ నిబంధనల మేరకే ఎంపిక 
  3. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం 
  4. నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత 

హైదరాబాద్ , సిటీబ్యూరో జనవరి 9 (విజయక్రాంతి): డీజీపీగా శివధర్‌రెడ్డి నియా మకాన్ని సమర్థిస్తూ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఆయన నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో డీజీపీ శివధర్ రెడ్డికి న్యాయపరంగా భారీ ఊరట లభించినట్లయింది. డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని నియమిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే ఈ నియామకంలో సీనియారిటీని విస్మరించారని, యూపీఎస్సీ మార్గదర్శకాలను తుంగలో తొక్కారని ఆరోపిస్తూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బలమైన వాదనలు వినిపించారు. డీజీపీ నియా మకం పూర్తిగా సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ కేసులో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే జరిగిందని కోర్టుకు వివరించారు.

యూపీఎస్సీ ప్యానెల్ ఎంపిక చేసిన ముగ్గురు అధికారుల జాబితా నుంచే, మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన శివధర్ రెడ్డిని ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాల్లో పసలేదని అభిప్రాయపడింది.

డీజీపీ నియామక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధా నం చట్టబద్ధంగానే ఉందని పేర్కొంది. కేవ లం అపోహలతో, సరైన ఆధారాలు లేకుం డా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. హైకోర్టు తాజా తీర్పుతో డీజీపీగా శివధర్ రెడ్డి కొనసాగింపుపై ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి.