calender_icon.png 14 September, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాచీన సంస్కృతిపై దాడిని ప్రతిఘటించాలి

16-12-2024 01:11:07 AM

అరుణోదయ 50 వసంతాల సభలో వక్తలు

హైదరాబాద్ సిటీబ్యూరో డిసెంబర్ 15 (విజయక్రాంతి)/ ముషీరాబాద్: ప్రాచీన సంస్కృతిపై బ్రాహ్మణీయ భావజాలం, ఫాసిజం పేరిట జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని వక్తలు ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, అంబటి నాగయ్య  పిలుపునిచ్చారు. అరుణోదయ 50 వసంతాల సభల్లో రెండో రోజులో భాగంగా ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని కాట్రగడ్డ శ్రీనివాస్‌రావు హాల్‌లో ప్రతినిధుల సభ జరిగింది.

ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) తెలంగాణ, ఏపీ రాష్ట్ర కమిటీల గౌరవాధ్యక్షురాలు విమలక్క, అరుణోదయ బృందం పాటలను ఆలపించి స్ఫూర్తి నింపారు. అంతకుముందు అమరవీరులకు సంతాపం ప్రకటిం చారు. కాకి భాస్కర్ అధ్యక్షతన ‘ప్రజా సాంస్కృతికోద్యమం  ఎదురవుతోన్న సవాళ్లు’ అనే అంశంపై అంబటి నాగయ్య, అనంతరం మోత్కూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ‘సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడిని నివారించడం ఎలా?’ అనే అంశంపై ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు ప్రసంగించారు.

అరుణోదయ సభల సందర్భంగా ప్రజా కళామండలి, విరసం, తమిళనాడు నుంచి వచ్చిన సందేశాలను నాయకులు చదివి వినిపించారు. అనంతరం సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు సంఘాల నాయకులు సౌహార్థ సందేశాలిచ్చారు. కార్యక్రమంలో జూపాక సుభద్ర, మాస్టార్‌జీ, తాయమ్మ కరుణ, భూపాల్, మన్నారం నాగరాజ్, జనార్ధన్, రాములు, మల్సూరు, రమేశ్ పాల్గొన్నారు. అనంతరం ముంబైకి చెందిన రాము పవర్ చేతుల మీదుగా ‘అరుణోదయం’ సావనీర్‌ను ఆవిష్కరించారు. 

నూతన కమిటీల ఎన్నిక..

అరుణోదయ సభలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతినిధులు అరుణో దయ నివేదికపై చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొమ్మిది తీర్మానాలను ఆమోదించారు. అనంతరం రెండు రాష్ట్రాల అరుణోదయ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షు రాలిగా విమలక్క తిరిగి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏపూరి మల్సూర్, ప్రధాన కార్యదర్శిగా పోతుల రమేశ్ ఎన్నిక కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా సుంకన్న, సుధాకర్‌లను ఎన్నుకు న్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం మత్తుపై, యువతను పెడదారి పట్టిస్తున్న వ్యవస్థలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కుల, మత ఛాందసవాదాన్ని నిరసిస్తూ శాస్త్రీయ భావాల ప్రచా రాన్ని ముమ్మరం చేయాలని, కవులు, కశాకారులపై పెడుతున్న కేసుల రద్దుకు కృషి చేయాలన్నారు. ఎన్‌కౌంటర్ హత్యలు లేని తెలంగాణ కోసం, నిజమైన ప్రజాస్వామ్యం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.