09-07-2025 12:50:01 AM
2026 నుంచి దీన్ని మరింత పెంచేలా నిబంధనలు
న్యూఢిల్లీ, జూలై 8: అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టరూపం దాల్చిన సంగతి విధితమే. ఈ చట్టం ద్వారా వీసా దరఖాస్తుదారులపై అదనపు భారం పడబోతున్నట్టు తెలు స్తోంది. ముఖ్యంగా నాన్ ఇమిగ్రెంట్లకు కొత్తగా వీసా ఇంటిగ్రిటీ ఫీజును డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తప్పనిసరి చేసింది. 2026 నుంచి దీన్ని మరింత పెంచేలా నిబంధనలు రూపొందించారు.
ఇమిగ్రేషన్ సేవల సంస్థ ఫ్రాగోమెన్ నివేదిక ప్రకారం.. నాన్ వీసా జారీ చేసే సమయంలో వీసా ఇంటిగ్రిటీ ఫీజు కింద 250 డాలర్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఈ రుసుమును పెంచే అధికారాన్ని డీహెచ్‌ఎస్‌కు కట్టబెట్టారు.
వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఆధారంగా 2026 నుంచి ప్రతీ సంవత్సరం దీన్ని పెంచే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీజును తగ్గించడం గానీ, రద్దు చేయడం కానీ ఉండదు. అయితే, కొన్ని పరిమితులకు లోబడి డీహెచ్‌ఎస్ మినహాయింపు ఇవ్వనుంది.
వీసాదారుడు వీసా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఐ గడువు కంటే ముందే చట్టపరంగా కొనసాగింపు, శాశ్వత నివాస అనుమతి లభించిన వారికి మాత్రమే వీసా ఇంటిగ్రిటీ ఫీజు రీఫండ్ ఉంటుంది. అమెరికాలో చదువులు, ఉద్యోగం కోసం వచ్చే వారిపై ఈ చట్టం ప్రభావం చూపనుంది.
అంతర్జాతీయ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, టూరిస్టులు, హెచ్ 1 బీ వీసాపై వచ్చే ఉద్యోగులకు ఆర్థికంగా కొంత భారంగా మారనున్నట్టు తెలుస్తోంది. వీసా ఇంటిగ్రిటీ ఫీజుతో పాటు ఐఢూ ఈఎస్‌టీఏ, ఈవీయూఎస్ ఫీజలు కూడా పెరగనున్నట్టు సమాచారం.