calender_icon.png 3 November, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భవిష్యత్ ప్రణాళికలకు జనగణనే పునాది

03-11-2025 03:22:31 AM

  1. రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి
  2. నగర ప్రణాళికలకు డేటా దోహదం
  3. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
  4. సెన్సస్--2027 ప్రీ-టెస్ట్ శిక్షణ ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ప్రభుత్వ ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో నాణ్యమైన జనగణన సమాచారం క్వాలిటీ సెన్సెస్ డేటా అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే అంతటి ప్రాముఖ్యత కలిగిన జనగణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చారు. సెన్సస్ ఆఫ్ ఇండియా-2027లో భాగంగా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం డివిజన్-112లో నిర్వహించనున్న ‘ప్రీ-టెస్ట్‘ కార్యక్రమానికి ఎంపికైన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల కోసం మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆదివారం పటాన్‌చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆమె ప్రారంభించారు.

ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఈ ప్రీ-టెస్ట్ జరగనుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ, ‘2026-27లో దేశవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి చేపట్టే ప్రధాన సెన్సస్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమాచార సేకరణ ప్రక్రియ. అది సంపూర్ణంగా విజయవంతం కావాలంటే, ఈ ప్రీ-టెస్ట్ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా, క్రమశిక్షణతో నిర్వహించాలి” అన్నారు.

కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మాట్లాడుతూ, “ఈ జనగణన ద్వారా సేకరించే సమాచారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని కుటుంబాల వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించాలి. ఈ డేటా ఆధారంగానే భవిష్యత్తులో నగర ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలు ఆధారపడి ఉంటుంది” అన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవరావు, సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాంత్, సర్కిల్-22 డిప్యూటీ కమిషనర్, సెన్సస్ చార్జ్ ఆఫీసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.