14-08-2025 12:00:00 AM
సినిమా ప్రతినిధి, ఆగస్టు 13 (విజయక్రాంతి): చిత్రపురి హౌసింగ్ సొసైటీలో సుమారు రూ.300 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని సినీకార్మికులు ఆరోపించారు. ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్న సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై పలువురు సినీకార్మికులు బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ.. “చిత్రపురిలో సినీకార్మికులను మోసం చేసే కుట్ర జరుగుతోంది. కాలనీలో మిగిలిన 2.5 ఎకరాల్లో సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించాలని కార్మికులు అడిగారు. కానీ కమిటీ పెద్దలు 1200 నుంచి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, బయటి వ్యక్తులకు అమ్ముకోవాలని చూశారు.
హెచ్‌ఎండీఏ, సీఎంవో కార్యాలయాల అధికారులతో కుమ్మక్కు అక్రమాలకు పాల్పడుతున్నారు. వల్లభనేని అనిల్‌పై ఇప్పటికే 15 ఎఫ్‌ఐఆర్‌లు, 10 ఛార్జ్‌షీట్లు నమోదయ్యాయి. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఆయన అక్రమాలు ఆపడం లేదు. ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదు” అన్నారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. “డబ్బులు చెల్లించి 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న 6 వేల మంది సభ్యులకు న్యాయం చేయాలి. కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలి.
ప్రస్తుత కమిటీని రద్దు చేసి, అడ్-హాక్ కమిటీని నియమించాలి. కొత్తగా కట్టబోయే ట్విన్ టవర్స్‌లో సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి, అర్హులకే కేటాయించాలి. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షుడు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకుడు సంకూరి రవీందర్, తెలంగాణ పోరాట మేధావి నాయకులు భద్ర, నవోదయం పార్టీ అధ్యక్షుడు శివశంకర్ పటేల్, ఆప్ పార్టీ నాయకురాలు హేమ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.