calender_icon.png 11 January, 2026 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

09-01-2026 12:03:00 AM

  1. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం పట్ల ఆగ్రహం 

మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం 

నిజామాబాద్, జనవరి 8 (విజయ క్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలను, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రిసెప్షన్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి, విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది హాజరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరైనా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, వైద్యులు, సిబ్బంది అందరూ విధుల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.   

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ ఉన్నారు.