10-01-2026 12:53:21 AM
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట, జనవరి 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది అడ్డు, అదుపు లేని పాలన అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సూర్యాపేట నియోజకవర్గం బీ ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్ పదేండ్ల పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందనీ కానీ ఈ రెండేళ్ల కాంగ్రేస్ పాలనలో రాష్ట్రం ఎంతో ఆగమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోవడం తప్ప అభివృద్ధి పట్టదన్నారు.
సాగునీరే కాదు.. తాగు నీరు కూడా సక్కగ ఇస్తలేరనీ విమర్శించారు. ఇచ్చిన హామీల మాట దేవుడెరుగు కానీ కెసిఆర్ ఇచ్చినయే అందుతలేవంటున్నారు. పెంచుతామన్నా పెన్షన్లు ఇంకా ఎన్నడు పెంచి ఇస్తారో చెప్పాలన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కెసిఆర్ పెట్టిన లక్ష తో పాటు తులం బంగారం ఎప్పుడిస్తరు స్పష్టంగా చెప్పి ఇవ్వాలన్నారు.
ఆడపిల్లలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఎటుపోయినయ్ అని ప్రశ్నించారు. కాంగ్రేసొళ్ళు ఇండ్ల ముందుకు ఓటు కోసం వచ్చినప్పుడు ప్రజలే నిలదీయాలన్నారు. రెండేళ్లు ఓపికపట్టుకుంటే వచ్చేది మల్లా కెసిఆర్ ప్రభుత్వమేనన్నారు. ఎవ్వరూ అధైర్య పడవద్దు.. ఐక్యతతో విజయాలు సాధించుకుందామన్నారు. పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలువురు పలు అనారోగ్య కారణాలతో దవాఖానాలో చికిత్స పొందిన 126 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.