10-01-2026 12:55:01 AM
చిట్యాల, జనవరి 9 (విజయ క్రాంతి): సుమారు మూడుకోట్ల అంచనా వ్యయంతో చిట్యాల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణానికి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. శుక్రవారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో 3 కోట్ల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీ లు ఇతర అభివృద్ధి పనులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశం తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో కొన్నిచోట్ల పార్టీకి చెందిన పాత, కొత్త నాయకుల మధ్య అంతరం ఏర్పడి కొన్ని స్థానాలను గెలవలేకపోయామని అది దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు ఎలాంటి ఇగోలు ఏవి పెట్టుకోకుండా సమిష్టిగా పని చేయాలన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లుగా ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేకపోయిందని కానీ ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేళ్లలోనే నకరేకల్ నియోజకవర్గ పరిధిలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే వేముల వీరేశం కు దక్కుతుందన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కచ్చితంగా పార్టీ అవకాశాలు కల్పిస్తుందని అప్పటివరకు ఓపికతో ఉండాలని సూచించారు. త్వరలోనే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 240 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి వాటికి అదనంగా మరో 300 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి సుమారు 600 ఇండ్లను పేదలకు పంచేందుకు చర్యలు తీసుకోనున్నామని ఆయన అన్నారు.
ప్రతి ఒక పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతుందని అందువల్లే అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో చిట్యాల మున్సిపాలిటీ లోని 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని విజయ పరంపర కొనసాగించేందుకు పార్టీ నాయకులు కృషి చేయాలన్నారు.
అందుకు వీలుగా ప్రతి వార్డుకు అనుభవజ్ఞులైన నాయకులను ఇన్చార్జిలుగా నియమించడం జరుగుతుందన్నారు. వారి దిశా నిర్దేశత్వంలో పార్టీ నాయకులు పనిచేసి పోటీచేసిన ప్రతి అభ్యర్థిని గెలిపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, పార్టీ పట్టణ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, మాజీ ఏఎంసీ చైర్మన్ పందిరి శ్రీనివాస్, వనమా వెంకటేశ్వర్లు, పాటి మాధవరెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.