01-08-2025 01:14:52 AM
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాల్సిందే
మెజార్టీ బీసీలు మైనార్టీగా ఉన్న పిడికెడు మంది దగ్గర అడుక్కోవాల్నా?
* రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల చుట్టే తిరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా బీసీల గురించి, బీసీ వాదం గురించే మాట్లాడుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే బీసీ సంఘాల నాయకులు, మేధావులంతా ఏకమై.. తామెంతో మాకంతా అన్న నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కులగణన, అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం వెనుక బీసీ సంఘాల నేతల కృషి ఎంతో ఉంది. అందులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కీలకపాత్ర పోషించారనే చెప్పాలి. బీసీల రిజర్వేషన్ల అంశం, వివిధ రాజకీయ పార్టీల వైఖరిపై జాజుల శ్రీనివాస్ గౌడ్ ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది. ఆయన మాటల్లోనే..
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన 42 సంవత్సరాల తర్వా త.. 1990లో మండల్ కమిషన్ రిపోర్ట్ త ర్వాత బీసీలకు మొదటిసారిగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన కాన్నుంచే బీసీలపై వివక్ష కొనసాగుతోంది. బీసీల్లో ఉత్పత్తి కులాలు, సేవా కులాలున్నా యి. బీసీలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు ఇవ్వాలి.
అప్పటినుంచి ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ల ఉద్యమం కొనసా గుతూ నే ఉంది. ప్రతి ఎన్నికల సమయంలో జనా భా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెం చుతామని ఎన్నికల్లో హామీ ఇస్తారు కానీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత రిజర్వేషన్లు పెంచకుండా మోకాలడ్డుతున్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాల్సిం దే. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యం. మా సోదరులు ఎస్సీ, ఎస్టీలకు జనాభా దా మాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.. అది వంద శాతం జరగాల్సిందే.
చివరికి అగ్రవర్ణాలకు కూడా జనాభా దా మాషా ప్రకారం అమలవుతున్నాయి. జనాభా దామా షా ప్రకారం రిజర్వేషన్లు అ మలుకాని సా మాజికవర్గం దేశంలో ఏదైనా ఉందంటే అది బీసీలే. మరీ బీసీలు చేసిన పాపం ఏంది? బీసీలుగా పుట్టడమే చేసిన పాపమా? ఈ పార్టీలు, పాలకులకు ఓట్లేయడమే పాప మా?. ఇదెక్కడి అన్యాయం. అందరికీ జనా భా దామాషా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలకు ఎందుకివ్వరు?.
మా వాటా మాకు దక్కాలి..
మా వాటా మాకు దక్కాలంటే చట్టబద్ధమైన రిజర్వేషన్లుండాలి. బీసీల సమగ్రా భివృ ద్ధిని దేశాభివృద్ధిగా చూడాలి. రాష్ట్రంలో, దేశంలో సగభాగంపైన ఉన్నటువంటి, 60 శాతం జనాభా ఉన్నటువంటి బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయకపోతే దేశాభివృద్ధి జరగనట్టే. 60 శాతం మంది ఉన్న బీసీలను సమానంగా చూడకుండా, అభివృద్ధిని ఆమడదూరంలో పెడితే దేశం స్వర్ణభారత్, అఖండ్ భారత్ ఏవిధంగా అవుతుంది.
బీసీలు ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పిస్తే ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్ అవుతుంది. కాబట్టి బీసీల అభివృద్ధిని దేశాభివృద్ధిగా చూడాలి. బీసీల అభివృద్ధిని రాష్ట్ర అభివృద్ధిగా చూడాలి. ఇదే మా డిమాండ్. 60 శాతం ఉన్న బీసీలు స్వాతం త్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా 18 శాతమే రాజకీయ పరిజ్ఞానం, ఆ తర్వాత ఉద్యోగ రంగంలో 11 శాతం, విద్యారంగంలో 29 శా తం మాత్రమే ఉన్నారు.
మా జనాభా దా మాషా ప్రకారం ఆయా రంగాల్లో చేరుకోలేకపోతున్నారు. ఏ వర్గం వారైనా.. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడమే భారత రాజ్యంగం పరిపూర్ణంగా అమలుజరినట్లు అని చెబుతోంది. ఇది రాజ్యాంగ పీఠి కలోనే ఉంది. మరీ ఆ పీఠిక బీసీలకు ఎందు కు వర్తిస్తలేదు?.
78 ఏళ్లుగా అడుక్కునేలా చేస్తున్నారు..
78 ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం బిచ్చగాళ్ల లెక్క అడుక్కునేలా చేస్తున్నారు. మెజార్టీగా ఉన్న బీసీలు.. మైనార్టీగా ఉన్న పిడికెడు మంది ఉన్న దగ్గర అడుక్కోవాల్నా?.. ఇప్పుడున్న పరిస్థిల నడుమ ప్రభుత్వాలు రిజర్వే షన్లకు శాశ్వత మార్గాలు చూపించాలి. బీసీలంటే ఈ దేశ సంపదను సృష్టించిన మూ ల వారసులు. బీసీల కుల వృత్తులు, చేతి వృత్తులతోనే కదా ఈ దేశం ఇంత పరిఢవిల్లుతోం ది.
అలాంటి బీసీలను మనోభావాలు దెబ్బతినేలా మీకంతే రిజర్వేషన్లు అమలు చేస్తా మని బీసీలను బలిపశువులను చేస్తే ఎట్లా?. బీసీల రిజర్వేషన్ల అంశాన్ని రావణకాష్టంలా మార్చుతున్నది ఎవరు?. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిం ది. ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టింది, బిల్లును కేంద్రానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పవర్‌ను ఎ న్ని రకాలుగా ఉపయోగించాలో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఇ ప్పుడు కేంద్రప్రభుత్వం వద్ద రిజర్వేషన్ల అం శం ఉంది.
దాన్ని చేయాల్సింది కేంద్రప్రభు త్వం కదా.. రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలుగా కాకుండా రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అంశాలుగా చూడాలి. గతంలో తమిళనాడు లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూ ల్లో పెట్టాలని కేంద్ర ప్రభు త్వం వద్దకు ఆ అంశాన్ని జయలలిత అప్ప ట్లో తీసుకెళ్లారు. అప్పుడు ఆమె అన్నాడీఎం కే ముఖ్యమంత్రి. కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ఉంది. అప్పు డు బీజేపీ లాగా తామెందుకు చేయాలని అనలేదు. చట్టసభల విలువలను కాంగ్రెస్ కాపాడుతూ నిర్ణయం తీసుకుంది.
బీసీ బిల్లు గాంధీభవన్‌లో పెట్టలేదు..
బీసీ రిజర్వేషన్ బిల్లు కాంగ్రెస్ పార్టీ గాం ధీభవన్‌లో పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో పెట్టారు. దీన్ని శాసనసభ ఆమో దించింది. ఆమోదించినప్పుడు ఒక్క కాంగ్రె స్సే కాదు.. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ పార్టీలూ ఉన్నాయి. చట్టసభల్లో ఆమోదించినప్పుడు దీన్నిఎందుకు రాజకీయ రంగు పూయాలె. మరీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతాలేదా?. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుకే న్యాయవాది.
ఆయనకు చట్టాలు, ప్రభుత్వ విధానాల గురించి తెలియనట్టుంది. తెలిసి కూడా నటిస్తున్నారా అనేది అర్థంకావడంలేదు. కులగణన రాజ్యాంగబద్ధంగా జరగ లేదని ఆయన అంటున్నారు. కులగణన చే సింది ప్రభుత్వ సంస్థనా? ప్రైవేట్ సంస్థనా? కులగణన చేయడానికి రాష్ట్ర అసెంబ్లీలో నిర్ణయం తీసుకొని, క్యాబినెట్‌లో తీర్మానించి, ప్రభుత్వం జీవో ఇచ్చి.. ప్రణాళిక శాఖ ద్వారా 90 వేల ఉద్యోగులను కేటాయించి కులగణను చేపట్టింది.
దీన్ని రాజ్యాంగ విరుద్ధమని ఎలా అంటారు. ఆయన అజ్ఞానానికి ఇది పరాకాష్ట. విద్యార్థి దశలో ఉన్నప్పుడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయనది అదే వైఖరి. జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఒక్కో నాయకుడు ఒక్కోలా మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవచ్చని డా.కే లక్ష్మణ్, ఆర్ కృష్ణయ్య అంటుంటే.. రాంచందర్‌రావు మాత్రం మేము 9వ షెడ్యూల్లో పెట్టమని అంటున్నారు.
అసెంబ్లీలో మా బీజేపీ ఎమ్మెల్యేలు తెలియక బీసీ బిల్లుకు మద్దతిచ్చారని అని ఆయన అంటున్నారు. ఇది ఆ ఎమ్మెల్యేలను అవమానించడమే. బీసీల ద్రోహి అయితేనే ఇలా మాట్లాడుతారు. బీసీ రిజర్వేషన్లపై కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మరోలా మాట్లాడు తున్నారు. 42 శాతంలో 10 శాతం ముస్లింలకు ఎలా ఇస్తారు? అని అంటున్నారు.
కామారెడ్డిలో ప్రకటించినది బీసీ డిక్లరేషన్ కాదు.. అది ముస్లిం డిక్లరేషన్ అంటున్నారు. ఎంఐఎంకు మేలుకలుగజేసేందుకే అంటున్నారు. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లు మీకు ఇష్టం లేకపోతే పార్లమెంట్‌లో ఈ బిల్లును పెట్టి సవరించండి. లేకుంటే చరిత్రలో బీసీల ద్రోహుల పార్టీగా బీజేపీ మిగిలిపోతుంది.
బీసీలను అన్యాయం చేయడంలో అన్ని పార్టీలు పోటీ..
బీసీలను అన్యాయం చేయడంలో అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక బీజేపీ ధర్నాకు సిద్ధమవుతుంది. రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే అది చేయకుండా వారు ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలో చేయాల్సిన పనిని చేయకుండా గల్లీలో ధర్నా చేస్తున్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తలేరు. బీసీ బిల్లు పంపి మూడునెలల పదకొండు రోజులవుతోంది. అది పరిష్కారం చేయరు. మరీ ఏం మొహం పెట్టుకొని ధర్నా చేస్తరు.
బీఆర్‌ఎస్ వాళ్లు ఎనిమిదో తారీఖున కరీంనగర్‌లో సభ పెడుతున్నారు. బీసీసి ముఖ్యమంత్రిని చేస్తా అని ఆ పార్టీ ప్రకటిస్తుందా?. కనీసం ఆ పార్టీ అధ్యక్షుడిని లేదా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను బీసీను చేస్తామని చెప్పగలుగుతుందా?. 34 శాతం నుంచి 18 శాతానికి రిజర్వేషన్లను తగ్గించిందే బీఆర్‌ఎస్. కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు పాల్గొనరు? బీసీలను రాజకీయ పార్టీలు బంతాట ఆడుకుంటున్నాయి.
బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఒక విధానమంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన దానికంటే కొద్దిగ తక్కువ చేసింది. అయినా చేయాలనే చిత్తశుద్ధితో పోతోంది. మేము ఢిల్లీలో ధర్నా చేస్తే సీఎం రేవంత్‌రెడ్డి, 42 మంది ఎంపీలు, 18 రాజకీయ పార్టీలు వచ్చి మద్దతు తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రాలేదు. కాంగ్రెస్ కులగణన చేసి బిల్లును తీసుకొచ్చారు.
బీసీలను ముఖ్యమంత్రులను చేసిన బీజేపీ పార్టీ ఉప రాష్ట్రపతిని పొమ్మన లేకుండా పొగపెట్టారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను తప్పించారు. రాష్ట్ర అధ్యక్ష పదివిని బండి సంజయ్, ఈటల రాజేందర్‌కు ఇవ్వకుండా ఒక్క శాతం ఉన్న వారికి కట్టబెట్టింది. అబద్దపు బూటకపు మాటలను బీజేపీ మాట్లాడుతోంది. లేకుంటే 2028 ఎన్నికల్లో బీజేపీకి బీసీలు గోరీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
గోవా వేదికగా బీసీల కార్యాచరణను ప్రకటిస్తాం..
దేశంలో మొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు మాజీ ప్రధాని వీపీ సింగ్ ప్రకటించిన రోజు ఆగస్టు 7. ఆ రోజు ప్రతి ఏటా జాతీయ ఓబీసీ మహాసభలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నాం. ఈసారి గోవాలో నిర్వహిస్తున్నాం. 29 రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ మేధావులు, నేతలు పాల్గొంటున్నారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించడంతోపాటు, భవిష్యత్తులో బీసీ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తాం. ఢిల్లీలో తాము చేసిన పోరాటం ఫలితంగానే జాతీయ జనగణతోపాటు కులగణను చేస్తామని బీజేపీ ముందుకొచ్చింది. మావాణిని, బాణిని వినిపించడానికి జాతీయ ఓబీసీ మహాసభ వేదికకాబోతోంది.
జానాభా దామాషా ప్రకారం గురుకులాలు ఉండాలి..
మాకు జనాభా దామాషా ప్రకారం గురుకులాలు ఉండాలి. బీసీలకు మొత్తం వెయ్యి గురుకులాలుండాలి. వీటిలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించాలి. 70 శాతం గురుకులాలలు అద్దె భవనాల్లో ఉన్నాయి. ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో ఏర్పాటు చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అన్ని ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి. ఆసరా ఇతర ఫించన్లను ప్రతి నెలా ఇస్తున్నప్పుడు పేద పిల్లలకు సకాలంలో ఎందుకివ్వరు.
ఇది కాలేజీల సమస్య కాదు. లక్షలాది మంది విద్యార్థుల సమస్య. గ్రీన్ ఛానెల్ ద్వారా ఫీజు బకాయిలు చెల్లించాలి. సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలను కాలేజీల యా జమాన్యాలు పరీక్షలను రాయించడంలేదు. దీంతో మళ్లీ వా రంతా కులవృత్తులకు వెళ్లిపోతున్నారు. వారి జీవితాలు చీకటిమయం అవుతున్నాయి. ఇది సమాజాభివృద్ధికి మంచిది కాదు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలే నష్టపోతున్నారు..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు గుదిబండలా మారింది. ఈ రిజర్వేషన్ల కారణంగా బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు. రావడమే రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మూలసూత్రాలకు విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలంటే ఒక కమిషన్ వేయాలి, అగ్రకులాల జనాభా లెక్కించాలి. అందులో పేదలెంతో నిర్ధ్దారించాలి.
కానీ ఇవేవి బీఆర్‌ఎస్ చేయలేదు. కేంద్రం ప్రభుత్వం పదికి పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనిచెప్పలేదు. ఒక శాతం నుంచి 10 శాతం వరకు మాత్రమే చెప్పింది. చాలా రాష్ట్రాల్లో నాలుగు శాతమే అమలవుతున్నాయి. తమిళనాడులో అసలు అమలేకావడంలేదు. కానీ ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వ చేసిన నిర్వాకం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ కట్టాఫ్ కంటే తక్కువ మార్కులు వచినా వారికి ఉద్యోగాలొస్తున్నాయి.
బెంజి కార్లు, బంజారాహిల్స్‌లో బంగ్లాలు ఉన్నవారు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నారు. వారు ఉన్నది 10 శాతం అయితే మొత్తంగా 60 శాతం అవకాశాలు తన్నుకుపోతున్నారు. బీసీలు 60 శాతం ఉంటే వారికి 25 శాతం అమలు చేస్తున్నారు. వాటిని కూడా సరిగా అమలు చేయడంలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పేదరికం ఆధారంగా నిర్ధారించాలి. ఇందులో ఏబీసీడీ వర్గీకరణ చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అగ్రవర్ణాలకే కాదు.. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని పేద వర్గాలకు కూడా అమలుచేయాలి.