25-05-2025 12:00:00 AM
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ పేరుతో తెరపైకి తీసుకొచ్చారు ఆర్ మాధవన్. ఆయన మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘ది ఎడిసన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన జీడీ నాయుడు బయోపిక్‌లో ఆయన టైటిల్ రోల్ పోషించనున్నారు.
ఈ ప్రాజెక్టును దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కిస్తున్నారు. జీడీ నాయుడు.. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు. కోయంబత్తూర్‌లో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ప్రయోగాలపై ఆసక్తితో పలు రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో విప్లవం సృష్టించారు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌ను రూపొందించింది ఈయనే. మిరాకిల్ మ్యాన్‌గానూ ఆయన గుర్తింపు పొందారు. జీడీ నాయుడు వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలతోపాటు వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమాలో చూపించనున్నారని సమాచారం. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ తనయ శివాని ఇందులో భాగమవుతోంది. మాధవన్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనున్న విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.