25-11-2025 12:00:00 AM
కాంట్రాక్టర్ల చేతివాటం.. అధికారుల కుమ్మక్కు?
మెట్‌పల్లి, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వం గర్భిణులు, బాలింతాలు, చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలనే సదుద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు సరఫరా చేస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ధన దాహంతో అది నీరుగారిపోతోంది. అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు చిన్నసైజ్, కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కథలాపూర్ మండలాల పరిధిలో మొత్తం 312 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 0 నెలల పిల్లలు 2,026 మంది ఉన్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 11,554, 3 సంవత్సరాల పిల్లలు 9,615, 5 సంవత్సరాల పిల్లలు 2,424 మంది ఉన్నారు. అలాగే ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం గర్భిణులు 2,434 మంది ఉండగా, బాలింతలు 2,210 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ఒక్కపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు 16 గుడ్లు, గర్భిణులు, బాలింతలు, మూడేళ్లకు పైబడిన చిన్నారులకు రోజుకు ఒక గుడ్డు ఇస్తున్నారు.
అయితే శిశు సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి గుడ్డు 45 నుంచి 50 గ్రాముల బరువు ఉండాలి. ఈ బరువు అధికారుల లెక్కలో మాత్రమే కనిపిస్తుంది. నవంబర్ నెలలో అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసిన గుడ్లను పరిశీలించగా ఒక్కొక్క గుడ్డు కేవలం 34 గ్రాముల నుంచి 40 గ్రాములే ఉన్నవి. అన్ని సెంటర్లకు ఇలాంటి గుడ్లే సరఫరా అవుతున్నాయని ఎన్ని ఆరోపణలు వచ్చినా అధికారులు స్పందించడం లేదు. ప్రాజెక్ట్ ఉన్నతాధికారిణి కాంట్రాక్టర్‌కు మద్దతుగా నిబంధనలు 40 నుండి 45 గ్రాములు ఉండాలని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా
కాంట్రాక్టర్లు ఇతర రాష్ట్రాల నుంచి నిలువ చేసిన చిన్న గుడ్లను తీసుకొస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ర్టంలో అకాల వర్షల కారణంగా కోళ్ల పరిశ్రమ భారీగా నష్ట పోవడంతో గుడ్ల ఉత్పత్తి తగ్గడం జరిగింది.ఈ కారణంగా కోడి గుడ్లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధార పడ్డ కాంట్రాక్టర్లు సాధారణంగా ఉండే వాటికి కన్నా చిన్నసైజ్ గుడ్లకు ధర తక్కువగా ఉండటంతో వాటిపై దృష్టి సారిస్తున్నారు.
గరిష్టంగా 45 గ్రాముల కన్న తక్కువ ఉన్న వాటినే ఏరికోరి కొనుగోళ్లు చేస్తున్నారు. కోళ్ల ఫారంలో మొదటిసారి గుడ్లు పెట్టినప్పుడు చిన్న పరిమాణంలో కోళ్లు గుడ్లు పెడతాయి. దీంతో వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఇతర రాష్టాల్లో నిలువ చేసిన చిన్న గుడ్లను కొనుగోలు చేసి ఇక్కడ సరఫరా చేయడం తోనే గుడ్లు కుళ్లి పోతున్నాయానే ఆరోపణలు వస్తున్నాయి.
టీచర్లకు తలనొప్పి
టెండర్‌లో చూపిన విధంగా కాకుండా నాసిరకంగా గుడ్లు సరఫరా చేయడంతో టీచర్లకు తలనొప్పిగా మారింది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తున్నారు. కోడిగుడ్లు నాణ్యత లోపంపై ఎప్పటికప్పుడు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని టీచర్లు పేర్కొంటున్నారు. అయినా గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌లో మార్పు రావడం లేదని చెపుతున్నారు. కొన్ని కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారని పలువురు టీచర్లు వాపోయారు.