16-12-2025 12:36:33 AM
ఆరోగ్య శ్రీ పేషెంట్ల వద్ద అదనపు వసూళ్లు ఆపాలి
హనుమకొండ, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య ఖర్చు పై నియంత్రణ కొరవడిందని, వైద్యం పేరుతో అడ్డూ అదుపూ లేకుండా దోపిడీ కొనసాగుతున్నదని సీపీఐ నాయకులు తెలిపారు. సోమవారం హనుమ కొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి క ర్రె లక్ష్మణ్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టెపాక రవి, నాయకులు అలువాల రాజు, దొమ్మాటి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో హనుమకొండ పట్టణం వైద్యానికి ఒక హబ్ గా మారిందని, ప్రతి ఏటా ఇక్కడి ప్రజలు వెయ్యి కోట్లకు పైగా వైద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యం సరిగా అందక పేదలు ప్రైవేటు వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆరోగ్య శ్రీ కింద చేస్తున్న వైద్యానికి కూడా అదనపు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో జబ్బుకు ఒక్కో ఆసుపత్రులో ఒక్కో రేటు వసూలు చేస్తున్నారని, ఐసీయూ బెడ్ చా ర్జీలలో కూడా తీవ్ర వ్యత్యాసం ఉందన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులలో దోపిడీని అరికట్టాల్సినజిల్లా అధికార యంత్రాంగం, ప్రైవేటు ఆసుపత్రల యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లాయన్నారు. రోగ నిర్థారణ కేంద్రాలైన ప్రైవేటు ల్యాబ్ లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయని, అనుమతి లేని కేంద్రాలను తక్షణమే మూసి వేయాలని డిమాండ్ చేశారు. అనేక ఆ సుపత్రులలో పార్కింగ్ సౌకర్యం, ఇతర అనుమతులు కూడా లేవని, తనిఖీలు జరగవని, ఆసుపత్రులలో రాసిన మందులు బయట దొరకవని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఖర్చుపై హేతుబద్దీకరణ లేకుండా పోయిందని, ఏ రోగానికి ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత లోపించిందని అన్నారు.
ఇటీవల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో టాగూర్ సినిమాలో మాదిరిగా చనిపోయిన వ్యక్తికి వైద్యం అందించి లక్షల రూపాయల డబ్బును గుంజారని, దీనిపై నిలదీసిన వారిని బెదిరింపులకు గురి చేశారని, ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచుగా జరుగుతున్నా ప్రభుత్వ యం త్రాంగం చర్యలు తీసుకోవటం లేదన్నారు. తాము ఇటీవల కాలంలో సీపీఐ ప్రతినిధి బృందంగా ప్రైవేటు ఆసుపత్రులపై సర్వే నిర్వహించామని, దానిలో విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న దోపిడీపై తాము జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. రానున్న రోజులలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను, సామాజిక సంఘాలను కలుపుకుని దీనిపై ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.