24-10-2025 12:00:00 AM
నేడు ఐక్యరాజ్యసమితి దినోత్సవం :
రెండో ప్రపంచ యుద్ధఅవశేషాలపైన ఏర్పడిన అంతర్జాతీయ ఐక్య కూటమి ఐక్యరాజ్యసమితి. ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం నుంచే ప్రపంచం లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను మార్పులు చేసుకుంటూనే వస్తున్నది. ఇన్నేళ్లుగా భద్రతామండలిలో తీసుకొచ్చిన సంస్కరణలే ఐక్యరాజ్యసమితి విజయానికి నాంది. 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని అవతరణ ఉత్సవాలను జరుపుకుంటున్న ఐక్యరాజ్యసమితి సమర్థవంతంగా కొనసాగాలి.
ఇక ఐక్యరాజ్యసమితి ఆవిర్భావానికి నాలుగేళ్లు సమయం పట్టింది. రెండో ప్రపంచ యుద్ధం జరు గుతుండగానే 1941లో బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలు సమావేశమై లండన్ నుంచి ఐక్యరాజ్యసమితి స్థాపన ప్రకటన చేశాయి. 1944 బ్రిటన్ ఉడ్స్ సమావేశంలో 44 దేశాలు పాల్గొన్నాయి. 1944 ఆగసు-అక్టోబర్ మధ్య డబర్టన్ ఓక్స్ సమావేశంలో ఐక్యరాజ్యసమితిలో ఐదు అంగాలు ఉండాలని తీర్మానం చేశాయి.
1945 ఫిబ్రవరిలో యాల్టా లో అమెరికా అధ్యక్షుడు రుజ్వేల్ట్, బ్రిటన్ ప్రధాన మంత్రి చర్చిల్, రష్యా అధ్యక్షుడు స్టాలిన్ సమావేశమై ఐదు రాజ్యాలకు వీటో అధికారం ఉండాలని తీర్మా నం చేశారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో 1945 ఏప్రిల్ 15 నుంచి జూన్ 26 వరకు జరిగిన సమావేశంలో 51 దేశాలతో ఆరు అంగాలతో 5 దేశాలకు వీటో అధికారం కల్పిస్తూ ఐక్యరాజ్యసమితి ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అలా 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి అమల్లోకి వచ్చింది.
ఐక్యరాజ్యసమితి స్థాపించిన నాటి నుంచి సభ్య దేశాల మధ్య తగాదాలను పరిష్కరిస్తూ శాంతి భద్రతకు విశేషంగా కృషి చేస్తున్నది. సభ్య దేశాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చినప్పుడే ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. సమితి రాజ్యాంగంలో ఉన్న 43 (1) క్లాజు వన్ నిబంధన ప్రకారం ఏదైనా రెండు దేశాల మధ్య విభేదాలను సంప్రదింపులు, విచారణ, మధ్యవర్తిత్వం, సంధానం, న్యాయస్థాన తీర్పు ద్వారా పరి ష్కరించుకోవాలి.
ఐక్యరాజ్యసమితి ఏర్పాటైన మొదట్లో 51 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 193గా ఉంది. ఆఫ్రికా ఖండ దేశమైన సుడాన్ 2017లో చివరగా ఐక్యరాజ్యసమితిలో చేరింది. ఐక్యరా జ్యసమితిలో ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాదే పెత్తం. అయితే మనకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. భారత్‌కు వీటో పవర్ దక్కాలంటే ఈ ఐదు దేశాలు ఒప్పుకోవాల్సిందే.
ఇప్పటివరకు భారత్ రెండేళ్ల తాత్కాలిక సభ్య దేశంగా 8 సార్లు ఎన్నికైంది. చివరగా 2021లో ఎన్నికైంది. మరోవైపు బ్రెజిల్, జపాన్, జర్మనీ కూడా ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. భారత్ ఏటా ఐక్యరాజ్యసమితికి 1.044 శాతం (37 మిలియన్ డాలర్స్) చెల్లిస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్న భారత్ కల తొందరలో నెరవేరాలని ఆశిద్దాం.
నర్సింగు కోటయ్య, 9985930885