03-11-2025 08:52:27 PM
హైకోర్టు అడ్వకేట్ బిక్షపతి, యాదయ్య..
ఇబ్రహీంపట్నం: బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని హైకోర్టు అడ్వకేట్ బిక్షపతి, యాదయ్య అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తగిన చొరవ తీసుకోవాలని 42 శాతం రిజర్వేషన్లకు సాధన సమితి పిలుపు మేరకు సోమవారం ఇబ్రహీంపట్నం మండల కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైకోర్టు అడ్వకేట్ బిక్షపతి, యాదయ్య లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఏబిసిడి వర్గీకరణతో కూడిన 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.
తొమ్మిదవ షెడ్యూల్ తోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. ఐదు శాతం కూడా లేని అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం గానీ, ఏ చట్టాలు గానీ అడ్డు రాలేదు కానీ, జనాభాలో సగంకు పైగా ఉన్న బీసీ, ఏంబీసీ కులాల రిజర్వేషన్లకు మాత్రం అడ్డువస్తున్నాయని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదని, అందుకు ఉదాహరణ బీసీ బిల్లు ప్రవేశ పెట్టిన విధానమే సరిగా లేదన్నారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్టు అడిగితే, సరైన కారణాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది.
కానీ అవేమీ లేకుండా కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లును అశాస్త్రీయంగా పెట్టడం జరిగిందన్నారు. బీసీ కులాలు దాదాపు 130కు పైగా ఉండగా, ఇప్పటికి వందకు పైగా కులాలు కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదన్నారు. ఈ వెనుకుబాటును కోర్టులకు చూపించి, వర్గీకరణతో కూడిన రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చూపిస్తే, కొంత న్యాయం జరిగేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ద్వంద నీతిని పక్కనబెట్టి బీసీ రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో భవిష్యత్తులో అన్ని పార్టీలు బీసీ, ఏంబీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెలమోని రవీందర్, తాళ్లపల్లి కృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.