calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో పండుగల కోలాహలం

10-01-2026 12:00:00 AM

సమ్మక్క జాతర.. సంక్రాంతి పండుగ..

మహబూబాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): అటు సమ్మక్క జాతర.. ఇటు సం క్రాంతి పండగ.. ఇంకోవైపు ఐలోని, కొత్తకొండ జాతరతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా పల్లెల్లో పండగ సందడి నెలకొంది. ఈసారి మేడారం సమ్మక్క సారల మ్మ జాతర జనవరిలోనే రావడం, ఇంకోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రాలు ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరన్న జాతరలతో పా టు సంక్రాంతి పండగతో పిండివంటలు చేసుకోవడం, జాతరకు వెళ్లే ఏ ర్పాట్లతో పల్లె ప్రజలు బిజీగా ఉన్నారు.

సమ్మక్క పున్నం కావడంతో సమ్మక్క సారలమ్మ దేవతలను ఇలవేల్పుగా కొలిచే లక్షలాదిమంది భక్తులు జాతరకు వెళ్లే ముం దుగా నెలరోజుల పాటు తమ ఇళ్లల్లో సమ్మ క్క పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెలలో 28 నుంచి 31 వరకు మేడారం జాతర నిర్వహిస్తుండడంతో ముం దుగా పల్లెలు, పట్టణాల్లో సమ్మక్క పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తల్లులకు ఇష్టమైన రోజులుగా బుధ, గురు, శుక్ర వారాల్లో తమ ఇండ్లలో సమ్మక్క దేవతను కొలుస్తారు.

మేడారంలో మొక్కులు సమర్పించే ఆనవాయితీ ఉన్న వారంతా ముందుగా మొ క్కులు తీర్చడంలో భాగంగా తీరిన కోరికలకు అనుగుణంగా ఎత్తు బంగారం (బెల్లం), ప సుపు బండారి, వడిబియ్యం, చీర సారే, కా సులు, వెండి తొట్టెలు, కోడె దూడ మొ క్కులు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. దేవుడు పూనే శివసత్తులకు ఒడి బియ్యం పోసి, వెండి, రాగి బేడీలు , కొత్త బట్టలు పెట్టి ఆశీర్వాదం పొందడం జరుగుతుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐలోని మల్లన్న, కొత్తకొండ వీరన్న జాతరలకు పోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఎములాడ రాజన్న దర్శనం కోసం...

మేడారం జాతరకు వెళ్లే ప్రతి ఒక్కరూ ముందుగా వేములాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. దీనితో మేడారం వెళ్లడానికి ముందుగా కుటుంబ సభ్యులంతా వేములవాడకు పోయే పనిలో నిమగ్నమయ్యారు. ఓవైపు పిండివంటలు, ఇంకోవైపు జాతర్లకు వెళ్లే పనిలో ప్రజలు బిజీగా గడుపుతున్నారు. వానాకాలం పంటల సాగు పూర్తి కావడం, చేతికి డబ్బులు అందడంతో దేవుళ్ళ దర్శనం, సమ్మక్క జాతరకు వెళ్లడానికి సంబురంగా ముందుకు సాగుతున్నారు.