calender_icon.png 11 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో గంజాయి పట్టివేత

10-01-2026 12:00:00 AM

  1. గంజాయి డాన్ నీతూ సింగ్ అల్లుడు అరెస్ట్
  2. వేర్వేరు ఘటనల్లో మరో నిందితుడి పట్టివేత

శేరిలింగంపల్లి, జనవరి 9 (విజయక్రాంతి): నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో గంజాయి విక్రయం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, గంజాయి డాన్ నీతూ సింగ్ అల్లుడైన కన్నయ్య సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువ చేసే 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి డాన్ నీతూ సింగ్ ప్రస్తుతం జైలులో ఉండగా, ఆమె వెనుక నుంచే దందాను నడిపిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా యని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లో మరో ఘటనలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన డెబు బాల రాపిడో ద్విచక్ర వాహనంపై గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.35 వేల విలువ చేసే 670 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోనూ ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.