calender_icon.png 28 January, 2026 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి దయ్యం.. సంతోష్‌రావే

28-01-2026 12:00:00 AM

  1. గుంపు మేస్త్రీతో జతకట్టిన గూఢచారి 
  2. కేసీఆర్ తినే ఇడ్లి సమాచారాన్ని కూడా రేవంత్‌రెడ్డికి చేరేవేసేది ఆయనే..
  3. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటాం
  4. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి) : తాను చెప్పిన దయ్యాల్లో మొదటి దయ్యం జోగినపల్లి సంతోష్‌రావే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఆయన గుంపు మేస్త్రీ రేవంత్‌రెడ్డికి  ప్రధాన గూఢచారి అని, కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారం కూడా చేరవేస్తారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉద్య మకారులకు, అమరవీరుల కుటుంబాలకు దూరం కావటానికి కారణం సంతోష్ రావే అని వెల్లడించారు.

గద్దర్ లాంటి నాయకులు గంటలపాటు గేట్ బయట వేచి చూడటం, ఈటల లాంటి వారు బయటకు రావటానికి కూడా ఈ సంతోష్ రావే కారణమని చెప్పారు. నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సై జ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో మంగళవారం కవిత పరామర్శించా రు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ... సంతోష్ రావు ను సిట్ పిలవటం మంచిదే, కానీ ఆయనకు శిక్ష పడటం అనుమానమేనని అన్నారు. ఇటువంటి దుర్మార్గుడికి కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావటం లేదన్నారు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా ఈ దుర్మార్గుడికి శిక్ష పడుతుందని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని తాము చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఒక్కోసారి మన నీడ కూడా మన కళ్లను కప్పే పరిస్థితి వస్తుందని, ఉద్యమకారులను కేసీఆర్‌కు దూరం చేసిన పాపం కచ్చితంగా ఈ దుర్మార్గుడికి తగులుతుందన్నారు. నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని పరామర్శించామని, ఆమె పరిస్థితి కొంచెం క్రిటికల్‌గా ఉన్నప్పటికీ కాస్త ఇంప్రూమెంట్ ఉందన్నారు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను చంపే ధైర్యం గంజాయి బ్యాచ్ చేసిందంటే ప్రభుత్వం అంటే వారికి ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందన్నారు.

డ్రగ్స్, గంజాయి ఫ్రీ చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ గ్రామాల్లో కూడా ఫ్రీగా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.  గృహహింస ఘటనలు జరగటానికి డ్రగ్స్, గంజాయి కారణమవుతోందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై వారి ప్రతాపం చూపాలని సూచించారు. ఎక్సైజ్, ఫారెస్ట్ సిబ్బందికి వెపన్స్ ఇవ్వాలని కోరారు.