14-07-2025 09:47:56 PM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో వేగం పెంచాలి..
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..
ములుగు (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S) అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయి గ్రౌండింగ్ కాక మిగిలిన ఉన్న ఇండ్లు వారంలోగా నిర్మాణ పనులను గ్రౌండింగ్ చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో ప్రోత్సహించాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో జిల్లాను ముందు వరుసలో ఉంచాలని కోరారు. ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. మండలాల వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు.
లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని, ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని,నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేపట్టిన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందజేస్తోందని కలెక్టర్ తెలిపారు.