17-10-2025 01:09:08 AM
15 రోజుల్లో 162 మంది పోకిరీలను పట్టుకున్న షీ టీమ్స్
ఎల్బీనగర్, అక్టోబర్ 16 : మహిళల రక్షణే ధ్యేయమని, బాలికలు, మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు పిలుపునిచ్చారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, మహిళలను వెంబడించి, వేధించే పోకిరీలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ..
వారిని, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు గురువారం ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచే స్తున్న 162 (మేజర్లు-92, మైనర్లు-70 ) మందిని షీ టీమ్స్ పట్టుకున్నారు.
వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలర్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ 16 నుంచి 30 తేదీ వరకు 180 ఫిర్యాదులు రావడంతో, మొత్తం 162 మందిపై కేసు నమోదు చేశారు. ఫిర్యాదుల్లో ఫోన్ల ద్వారా వేధించినవి -36, సోషల్ మీడియాలో వేధిచినవి-69, నేరుగా వేధిచినవి%--% 75 ఉన్నాయి. వీటిలో క్రిమినల్ కేసులు-5, పెట్టి కేసులు- 68, 92 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి.ఉషారాణి తెలిపారు.
మెట్రో రైల్వే స్టేషన్లో డెకాయ్‌ఆపరేషన్ నిర్వహించి, మహిళా కంపార్ట్మెంట్ లోకి వెళ్లి ప్రయాణిస్తున్న 5 మంది వ్యక్తులను అరెస్టు చేసి, జరిమానా విధించారు. కార్యక్రమంలో ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు, ఇన్ స్పెక్టర్లు ఎం.ముని, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్సు రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.