23-01-2026 12:00:00 AM
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కుమ్రం భీం ఆసిఫాబాద్/జైనూర్, జనవరి 22(విజయ క్రాంతి): ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో అంతరాయం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టి విక్ర మార్క తెలిపారు.
గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన ఆవరణలో లింగాపూర్ మండల కేంద్రం, కెరమెరి మండలం ధనోరా, ఆసిఫాబాద్ మండలం వావుడం, చింతలమా నేపల్లి మండలం గూడెం గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయ నిర్మాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ ఫలాలు అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 2023లో చేపట్టిన పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను బడ్జెట్లో చేర్చి దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్ బాబు, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్ కుమార్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్లా,
ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఆసిఫాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ, డిసిసి అధ్యక్షురాలు సుగుణ, నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యాం నాయక్, డిసిసి మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు, జిల్లా అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.