14-10-2025 11:01:57 PM
అందరి అభిప్రాయాలు తీసుకుంటాం..
ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్..
డీసీసీల నియామక ప్రక్రియలో భాగంగా పార్టీ శ్రేణులతో సమావేశం..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే సంఘటన్ శ్రుజన్ అభయాన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ అన్నారు. అందరు కలిసి గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించారని సూచించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారీ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి రాహుల్ గాంధీ చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించారన్నారు. డీసీసీ అధ్యక్ష పదవీ కోసం పార్టీ శ్రేణుల అభిప్రాయం కోసం జిల్లాల్లో పరిశీలకుల బృందం పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగానే మంగళరం రాత్రి ఆదిలాబాద్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులతో అభిప్రాయాన్ని సేకరించారు. ఈ మేరకు ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ మాట్లాడుతూ... రానున్న బీహార్ హర్యానా లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. మోదీ గత ఎన్నికలలో అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్నారని, కాని కష్టం మీద 250 సీట్లు దాటాయన్నారు.
నల్లధనాన్ని బయటికి తీస్తానని ప్రగల్భాలు పలికి కార్పోరేట్లకు కోట్ల రుణాలు మాఫీ చేసారన్నారు. అన్నం పెట్టే అన్నదాతకు మాత్రం రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 2004లో కాంగ్రెస్ ఇక్కడ గెలిచిందని ఆ తర్వాత ఓటమికి నేతల మధ్య సఖ్యత లేకపోడమే అన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి కట్టుగా ఉంటే ఆదిలాబాద్ లో గత ఎన్నికలలో పార్టీ ఓడిపోయేదే కాదన్నారు. డీసీసీ అభ్యర్ది నియామకం విషయంలో అందరి అభిప్రాయం తీసుకుంటామని తెలిపారు. ఎవర్ని నియమిస్తే బాగుంటుందో చెప్పాలని కోరారు. అనంతరం మండలం, బ్లాక్, తాలూకా లెవల్లో అధ్యక్షుల నియామకం చేపడతామన్నారు. సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, సంఘటన్ శ్రుజన్ అభియాన్ సమన్వయ కర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంభూపాల్, కార్యక్రమ కోఆర్డినేటర్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, నాయకులు కంది శ్రీనివాస రెడ్డి, ఆత్రం సుగుణ, నరేష్ జాదవ్, ఆడె గజేందర్, తదితరులు పాల్గొన్నారు.