22-10-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్, వి.పాటిల్
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం హేమచంద్రపురం నందుగల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
విధి నిర్వహణలో దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) ను జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహశక్తులతో పోరాడి చనిపోయిన పోలీస్ పోలీసు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని,శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత,ప్రజల రక్షణ,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పని చేస్తుందన్నారు.
శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటమే ప్రధాన కారణమని అన్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజల కోసం శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలని సైతం పణంగా పెట్టి సంఘ విద్రోహశక్తులతో పోరాడి వీరమరణం పొందిన పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి,గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతుంది అనడానికి మన రాష్ట్రమే నిదర్శనo. విధి నిర్వహణలో ప్రాణాలర్పించి అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెల కట్టలేనివన్నారు.
అనంతరం ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా తీవ్రవాదులు,సంఘ విద్రోహక శక్తుల చేతుల్లో అమరులయిన 191 మంది పేర్లను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేందర్,డిఎస్పీలు చంద్రభాను, రెహమాన్, మల్లయ్యస్వామి, రవీందర్ రెడ్డి, సతీష్ కుమార్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్త్స్రలు, పోలీస్ కార్యాలయ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.