22-10-2025 08:03:23 PM
కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్..
నకిరేకల్ (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కట్టంగూర్ ఎస్సై మునుగోటి రవీందర్ కొనియాడారు. పోలీస్ అమరవీరుల డే పురస్కరించుకొని బుధవారం కట్టంగూర్ మండలంలోని అయి టిపాముల గ్రామంలో సిమీ ఉగ్రవాదుల చేతిలో హతమైన ఐటిపాముల గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ చేగోని నాగరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో సిమీ ఉగ్రవాదులు కాల్పులు జరపగా వారిని వెతికే క్రమంలో ఉగ్రవాదుల చేతిలో కానిస్టేబుల్ నాగరాజు వి రోచితంగా పోరాడి వారి తూటాలకు బలై దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన గొప్ప పోరాట యోధుడని కీర్తించారు. ఆయన స్మారకార్థం గ్రామంలో విగ్రహం ఏర్పాటుచేసి కార్యక్రమాలు నిర్వహించడం ఆయన మరణానికి గ్రామస్తులు అందించిన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత నాగరాజు తండ్రి చేగోని శ్రీమన్నారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది చుక్కయ్య గౌడ్, పోలీస్ సిబ్బంది బండారు సతీష్, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని నివాళులర్పించారు. నాగరాజు సేవలను కీర్తిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.