ఎస్‌ఆర్‌ఆర్ పూర్వ విద్యార్థిని గౌరవించిన ప్రభుత్వం
ముకరంపుర, మే 12(విజయ క్రాంతి)విద్యలో అద్భుత ప్రతిభ కనబరిచిన కుమారి కె. సుప్రియ ను తెలంగాణ ప్రభుత్వం సోమవారం సన్మానించింది. కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాల విజ్ఞాన శాస్త్ర పూర్వ విద్యార్థిని సుప్రియ ఆమె సాధించిన విద్యా విజయాలకు గుర్తింపుగా హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సుప్రియ 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆమె అసాధారణ ప్రతిభకు మరియు అంకిత భావానికి గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. కుమారి సుప్రియ కరీంనగర్ లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ కళాశాలలో బి.ఎస్.సి ఎంపీసీ పూర్తి చేశారు.
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆమె కళాశాల టాపర్ గా నిలిచి తన ప్రతిభను చాటుకుంటూ, ఆమె దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ చెన్నైలో ఎం.ఎస్.సి ఫిజిక్స్ చదివే అవకాశాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె అక్కడ తన ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు.ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులను ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాల వైపు ప్రోత్సహించా లనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ పురస్కారం ఒక నిదర్శనం.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ పి నితిన్, అధ్యాపక బృందం సుప్రియ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.






