30-10-2025 07:18:08 PM
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి..
చండూరు (విజయక్రాంతి): మొంథా తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎలాంటి షరతులు లేకుండా జియో టాక్ కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా కల్పించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి అన్నారు. గురువారం చండూరు మున్సిపాలిటీలోని అంగడిపేటలోని రాపోలు లక్ష్మయ్య, ప్రభాకర్ ఇంట్లో మగ్గాల గుంటలలోనికి ఊటనీరు వచ్చి నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ లేదని, ఆ కాలనీ వెనుక భాగంలో వెంచర్ నుండి వరద నీరు కాలనీలోకి వచ్చి చేరుతుందని వెంటనే ఆ కాలనీలో డ్రైనేజీలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చేనేత కార్మికుల మరియు సహకార సంఘాల దగ్గర నిల్వ ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. చేనేత కార్మికుల మరియు సహకార సంఘాల ద్వారా నేసిన వస్త్రాలు మార్కెట్ సౌకర్యం లేక నిలువలు పేరుకపోయి ఉపాధి లేక నేసిన కూలి గిట్టుబాటు దాకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. చేనేత సహకార సంఘాలు తీసుకున్న రుణాలను క్యాష్ క్రెడిట్ మాఫీ చేయాలని, చేనేత కార్మికులకు రుణం ఎంత ఉన్నా ప్రభుత్వం ఇస్తానన్న లక్ష రూపాయలను ఎలాంటి శరత్తులు లేకుండా అమలు చేయాలని ఆయన అన్నారు.
రుణమాఫీ విషయంలో లక్ష రూపాయలకు పైగా రుణాలు ఉన్న ప్రభుత్వం మాఫీ చేస్తానని ఇంతవరకు మాఫీ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీj ప్రింట్ చీరలు తయారవుతున్న వాటిని అరికట్టి చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు. మొంతా తుఫాను ప్రభావం వల్లనష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.,చేనేత కార్మికుల కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన అన్నారు. చేనేత కార్మికులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, చేనేత కేంద్రాలలో యారన్ డిపోలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.
అర్హత కలిగిన చేనేత కార్మికులకు ఇల్లు లేని పేదలకు120 గజాల స్థలం ఇచ్చి కేంద్రంరూ. 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి హౌస్ కం వర్క్ షెడ్ నిర్మాణం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కర్నాటి వెంకటేశం, చండూరు చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు రాపోలు వెంకటేష్, ఉపాధ్యక్షులు పున్న జనార్ధన్, చేనేత కార్మిక సంఘం నాయకులు కర్నాటి గణేష్, చెరుపల్లి గణేష్, చిలుకూరి రాములు తదితరులు పాల్గొన్నారు.