calender_icon.png 31 October, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షాలకు నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

30-10-2025 08:53:29 PM

మందమర్రి (విజయక్రాంతి): మండల పరిధిలోని సారంగపల్లి రెవెన్యూ గ్రామ శివారులో గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నేలకొరిగిన వరి, పత్తి చేలను జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి  మాట్లాడుతూ, రైతులు నేలకొరిగిన పరిపొలాల నుండి నీటిని పూర్తిగా తొలగించాలని, వరి కొయ్యలను నిటారుగాపైకి లేపి కుచ్చులుగా కట్టుకోవాలని తద్వారా గాలి బాగా ఆడి కోత దశలో ఉన్న వరి పైరుకు ఎటువంటి బ్యాక్టీరియా శిలీంద్రపు జాతి తెగుళ్లు ఆశించకుండా ధాన్యము నాణ్యతను కాపాడవచ్చన్నారు.

అదేవిధంగా పంట నష్టము పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించి రెండు మూడు రోజులలో పూర్తిస్థాయి సర్వేను మండల వ్యవసాయ అధికారుల ద్వారా చేపడతామని రైతులు అధైర్యపడవద్దని తెలిపారు. అనంతరం పత్తి రైతులు పత్తిని అమ్ముకోవడంలో ప్రతి రైతు మొబైల్ ప్లే స్టోర్ నుండి కపాస్ కిసాన్ అనే ఆప్ ను డౌన్లోడ్ చేసుకుని స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సిసిఐ కేంద్రాలకు వెళ్లాలని, కేవలం స్లాట్ బుకింగ్ పొందిన రైతుల వాహనాలను మాత్రమే సిసిఐ లో అనుమతించడం జరుగుతుందని తెలిపారు. స్లాట్ బుకింగ్ సమయంలో ఓటీపీలు రావడంలో ఇబ్బందులు ఉన్నట్లయితే రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద మొబైల్ నెంబర్ల మార్పు ప్రక్రియ చేసుకొని ఓటీపీలు పొంది స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తిని సిసిఐ కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు పెద్దపెల్లి వెంకటేశం, నసీరుద్దీన్, శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.