calender_icon.png 31 October, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం తీరని నష్టం

30-10-2025 08:40:59 PM

- తడిసి ముద్దయిన పత్తి, సోయా పంటలు

- సోయా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, సిసిఐ పత్తి కొనుగోళ్లను చేపట్టకపోవడంతో మండిపడుతున్న మండల రైతాంగం

- ఉండి కూడా లేనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం

కుభీర్: నిన్న మొన్నటి వరకు కురిసిన వర్షాలకు తోడు రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం మండల రైతాంగానికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికి వచ్చిన నేపథ్యంలో అమ్ముకుందామనుకునే సమయంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రకృతి కన్య చేయడం ఒక పక్క అయితే సోయా చేతికి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో ఇలా చేతికి వచ్చిన పంట తడిసి ముద్దయి సోయా పంట పప్పుగా మారడం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం రైతుల్లో విస్మయానికి గురిచేస్తుంది. నెల రోజులుగా సోయా పంట చేతికి వచ్చినప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంలోని ఆంతర్యం ఏమిటో రైతులకు అర్థం కావడం లేదు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కన్నీళ్లు తెప్పించి వారి ఉసురు పోసుకుంటుందని బాహాటంగా పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కుభీరులోని మార్కెట్ యార్డులో రైతులు ఆరవసి గోనెసంచుల్లో కుట్టి కుప్పలు వేసిన సంచులు తడిసి ముద్దయ్యాయి. పైనుంచి పాలిథిన్ కవర్లు కప్పినప్పటికీ కింది నుండి వర్షపు నీరు చొచ్చుకు వచ్చి తడిసిపోయాయి.

దీంతో రైతులు చేసేదేమీ లేక, గోనె సంచులు దొరకక నాన్న ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చేలల్లో రైతులు సాగు చేసిన పత్తి పంట తీసి ఇంటికి తెచ్చుకుందామనుకుంటున్న తరుణంలో ఈ వర్షాల వల్ల కిందికి వేలాడుతూ నేలపై పడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక కర్రీఫ్ లో సాగుచేసిన మొక్కజొన్న పంట కోత వేసి కుప్పలు వేసిన చోటే వాటికి మొలకలు వస్తున్నాయి. ఎటు చూసినా రైతుకు నూయ్యి మాత్రమేఎటు చూసినా రైతుకు నుయ్యి మాత్రమే కనబడుతుండడంతో సాగుకు పెట్టిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

గతంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పంట చేతుకు వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులు పండించిన పూర్తి పంటలను మద్దతు ధరతో కొనుగోలను చేసిందని అంటున్నారు. ఏడాది ఖరీఫ్లో సాగు చేసిన పంటలన్నీ వర్షాల కారణంగా రైతులను నిలువునా ముంచాయని ఇంత జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మండలంలోని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరిచి తడిసిన సోయా, మొక్కజొన్న, పత్తి పంటలను ఎలాంటి షరతులు విధించకుండా మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.