30-10-2025 08:39:13 PM
 
							సిపిఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి..
నీటిలో మునిగిన పత్తి పంటలను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు..
చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): మొంథా తుఫాన్ తాకిడికి రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిమండల పరిధిలోని వివిధ గ్రామాలలో వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను సిపిఎం ఆధ్వర్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయానికి మొంథా తుఫాన్ రావడంతో పత్తి, వరి పంటలు వాగులు కాలువలు పొంగిపొర్లడంతో రైతులు పూర్తిగా నష్టపోయారని, పత్తి పంటకు పెట్టుబడి మొత్తం పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ వల్ల రైతులు తీవ్రగా నష్టపోయారని వారికి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తడిసిన,మొలకెత్తిన వరి ధాన్యాన్ని ఐకెపి కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. తడిసిన ధాన్యానికి మ్యాచర్ తో సంబంధం లేకుండా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తి, వరి పంటలు మార్కెట్లకు వస్తున్న తరుణంలో మొంతా తుఫాను వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మండల వ్యాప్తంగా పంట నష్టం పై అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం రైతులకు చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం పెరుమాండ్ల రాజు, నరేష్, రైతులు తిరుమణి కొండలు, బోదాసు అంజయ్య, బెక్కం శ్రీనివాస్, రమేష్, తిరుమణి నరేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.