24-07-2025 12:07:36 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
అర్మూర్, జూలై 23 (విజయ క్రాంతి) : మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తోందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆర్మూర్ ప్రయాణ ప్రాంగణంలో ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహిం చారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెస్తూ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో గడిచిన సుమారు 20 నెలల కాలంలోనే 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు.
తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో రూ. 6680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయని అన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 5.54కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయడం వల్ల రూ. 230 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఉచిత ప్రయాణ వసతి వల్ల మహిళలు తమ అవసరాల నిమిత్తం విరివిగా ప్రయాణ సదుపాయాన్ని వినియోగిస్తున్నారని అన్నారు.
పురుషులతో సమానంగా మహిళలు ప్రయాణ వసతి పొందుతున్నారని, భవిష్యత్తులో పురుషులను అధిగమించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఒక్క నిజామాబాద్ రీజియన్ పరిధిలోనే కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేశారని కలెక్టర్ తెలి పారు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ ద్వారా ఆయా పాఠశాలల విద్యార్థినులకు నిర్వహించిన వ్యాస రచన పోటీలలో గెలుపొందిన బాలికలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పలువురు మహిళా ప్రయాణికులను, ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, ఆర్మూర్ డిపో మేనేజర్ రవి కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబ గౌడ్, ప్రయాణికులు పాల్గొన్నారు.