21 April, 2026 | 7:04 PM

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

02-07-2025 12:52 AM

- అంబరాన్నంటిన సంబురాలు

- భక్తజన సంద్రంగా ఆలయ ప్రాంగణం

- ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు పొన్నం, కొండా సురేఖ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం తొలి మంగ ళవారం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. ఏటా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఎల్లమ్మ కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేద పండితుల మంత్రోచ్ఛ రణలు, మంగళవాయిద్యాల నడుమ ఉద యం 11:55 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించారు.

ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి  కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్‌లు, వీఐపీ ఎంట్రీ కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అమ్మవారి కల్యాణాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మూడు రోజుల పాటు జరుగనున్న కల్యాణ వేడుకల్లో మొదటిరోజు పెళ్లికూతురుతో మోదలు ఎదుర్కొళ్ల కార్యక్రమం, రెండో రోజు కల్యాణం, మూడో రోజు రథోత్సవం జరుగనుంది.

ఈ ఉత్సవంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ  అనిల్ కుమార్ యాద వ్, ఎమ్మెల్యేలు  తలసాని శ్రీనివాస్ యాద వ్,  దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఇన్‌చార్జి కోట నీలిమ, కార్పొరేటర్ సరళ, హేమశామల పాల్గొన్నారు.