calender_icon.png 6 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశ్ నిమజ్జనానికి గ్రేటర్ సిద్ధం

31-08-2025 12:16:46 AM

ఏర్పాట్లను పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 30 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా సురక్షితంగా, పర్యావరణ హితంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వెల్లడించారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నిమజ్జన పాయింట్లను పరిశీలించి, భద్రత, శుభ్రత, ట్రాఫిక్ నిర్వహణపై సమీక్షించారు.

కమిషనర్ కర్ణన్, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ తో పాటు ఇతర అధికారులు సనత్‌నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద తవ్విన కుంట, నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా బేబీ పాండ్, అమీర్‌పేట్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పోర్టబుల్ పాండ్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిమజ్జ నం సజావుగా సాగేందుకు బారికేడింగ్, లైటింగ్, క్యూ లైన్లు, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.

నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు, శుభ్రత, భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై బహుముఖ వ్యూహంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.గణేశ్ నిమజ్జనం ఆధ్యాత్మిక వాతావరణంలో, సురక్షితంగా జరిగేలా జీహెఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. పర్యావరణ హిత సదుపాయాలను వినియోగించుకోవాలని, అధికారులు చేస్తున్న కృషికి సహకరించాలని ఆయన నగర ప్రజలు, భక్తులకు విజ్ఞప్తి చేశారు. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా నిమజ్జనం విజయవంతం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు