calender_icon.png 6 September, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినాయకా... సెలవిక..!

05-09-2025 11:44:17 PM

మందమర్రి,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి అంగరంగ వైభవంగా బయలుదేరి వెళ్లారు. పట్టణంలో, మండలంలో  ప్రతిష్టించిన సుమారు 250 గణనాధులను శుక్రవారం ఘనంగా నిమజ్జనం నిర్వహించారు.వినాయక మండలిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథులను బాజభజంత్రీలు, కోలాటాలతో  నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి తరలించారు. అంతకుముందు తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథునికి ఆయా ఆయా గణేష్ మండలిల ఆధ్వర్యంలో  నిమజ్జనాన్ని పురస్కరించు కొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణేష్ మండప కమిటీల ఆధ్వర్యంలో మండపాల వద్ద నవరాత్రులు పూజలందుకున్న గణనాధుని చేతిలోని లడ్డు, కలశం, వివిధ రకాల పూజా వస్తువులు వేలంపాట నిర్వహించగా వాటిని సొంతం చేసు కునేందుకు భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. ఆయా మండపాల ఆవరణలో పోటా పోటీ వేలం పాటలతో నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డు ప్రసాదాలను భక్తులు దక్కించుకున్నారు. అనంతరం ఆయా మండపాలలో ప్రతిష్టించిన గణనాధులను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల ద్వారా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీలలో గణనాధులను ఊరేగింపు నిర్వహించగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ, కోలాటాలతో సంప్రదాయ బద్దంగా నిమజ్జనానికి తరలించారు. గణనాధుని ఊరేగింపుల సందర్భంగా చిన్నారులు, యువకులు, మహిళలు ఆనందంగా నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల,యువకుల,మహిళల నృత్యాలు, కోలాటాలతో పట్టణం, మండలంలోని గ్రామాలు సందడిగా మారాయి.

హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో..

పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో  నవరాత్రి పూజలు అందుకొని నిమజ్జనా నికి బయలుదేరిన గణనాధు లకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ టపాసులు పేలుస్తూ ఆనందోత్సాహల మధ్య గణనాధునికి ఘనంగా వీడ్కోలు పలుకగా మంచిర్యాల్లోని గోదావరి తీరానికి నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్ర కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ శశిధర్ రెడ్డి నేతృత్వంలో పట్టణ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.