calender_icon.png 24 August, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్‌కు జీ-7 అండ

15-06-2024 12:05:00 AM

ఇటలీలో జరుగుతున్న జి-7 శిఖరాగ్ర సదస్సులో అగ్రరాజ్యాధినేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్ట్‌లో ఈ నెల 13నుంచి 15వరకు మూడు రోజులపాటు జరగనున్న ఈ సమావేశంలో జీ-7 సభ్య దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్‌తోపాటు యూరోపియన్ యూనియన్ దేశాల అధినేతలు పాల్గొంటున్నారు. వీరితోసహా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తదితరులు అతిథులుగా పాల్గొంటున్నారు.  ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోడీ జరుపుతున్న తొలి విదేశీ పర్యటన కావడంతో ఈ సమావేశానికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

సమావేశంలో పాల్గొనడం కోసం గురువారం ఇటలీ చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. కాగా, జీ--7 సదస్సులో  కృత్రిమమేధ, ఇంధనం, మధ్యధరా, ఆఫ్రికా దేశాల్లో పరిస్థితులపై తాను ప్రధానంగా చర్చించనున్నట్లు ఇటలీ బయల్దేరి వెళ్లడానికి ముందు చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన జీ--20 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా జరుగుతున్న ఈ సదస్సు నేపథ్యంలో ప్రధాని ఇటలీ, బ్రిటన్ ప్రధానులతోపాటు సదస్సుకు హాజరవుతున్న వివిధ దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ మోడీ సమావేశమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా భేటీ కానున్నారు. కాగా, జీ-7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం  ప్రసంగించనున్నారు.

ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించిన తొలి పోప్‌గా ఆయన చరిత్రకెక్కనున్నారు.  కృత్రిమమేధతో ఒనగూరే ప్రయోజనాలు, దానితో పొంచి ఉన్న ముప్పులపై ఆయన సదస్సులో ప్రధానంగా ప్రసంగించనున్నారు. అలాగే, గాజా, ఉక్రెయిన్‌లలో శాంతికోసమూ ఆయన సదస్సులో పిలుపునిచ్చే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా ప్రాంతాన్ని ఆదుకునేందుకు, యుద్ధాలను అపేందుకూ ఈ సమావేశంలో అధినేతలు ప్రధానంగా చర్చలు జరపనున్నారు.   చర్చలు, సంప్రదింపుల ప్రక్రియద్వారా ఉక్రెయిన్, హమాస్-, ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలికేందుకు భారత్ సదా సిద్ధంగా ఉందంటూ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా వెల్లడించారు. 

మరోవైపు యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ఆ దేశానికి ఈ ఏడాది చివరినాటికి 50 బిలియన్ డాలర ్ల(దాదాపు 4.17 లక్షల కోట్ల రూపాయలు) సాయం అందించాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి. వేర్వేరు దేశాల్లో స్తంభించిన రష్యా నిధులనుంచే ఈ ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించడం విశేషం. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభించిన తర్వాత 300 బిలియన్ యూరోల రష్యా సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను జీ-7 దేశాలు స్తంభింప జేశాయి. దీనిపై వచ్చే వడ్డీలో 50 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్‌కు రుణంగా అందించాలని యూరోపియన్ యూనియన్ ప్రతిపాదించింది. యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్‌ను పునర్నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్లకంటే ఎక్కువ ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనేకాక అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడైన ఒలిగార్చ్ ఆస్తులనూ ఈయూ, జీ-7 దేశాలు స్తంభింపజేశాయి. యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్‌ను పునర్నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్లకంటే ఎక్కువ ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అయితే, రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధించింది. దీనినుంచి తప్పించుకోవడానికి సీజ్  చేసిన రష్యా ఆస్తులనుంచి వచ్చే వడ్డీనే ఉక్రెయిన్‌కు రుణంగా అందించాలని జీ-7 దేశాలు నిర్ణయించాయి. కానీ, ఈ రుణాన్ని అందించాలంటే ఈయూ సభ్య దేశాలన్నీ అనుమతించాల్సి ఉంటుంది. ఈ చిక్కును ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.