calender_icon.png 23 August, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండిత గోపదేవుని అనుగ్రహం

15-06-2024 12:05:00 AM

డా. మసన చెన్నప్ప :

‘కుర్చీ బ్యాలెన్సు తప్పి, నేను కింద పడతానేమో’ అనే భయాన్ని దాదాపు విడిచిపెట్టేశాను. లోపల మంచం మీద కూర్చునే గోపదేవులు నాకు ఆ రోజు పాఠం చెప్పారు. మధ్యాహ్నం ఒంటిగంట దాకా విన్నాను. నాకు బాగా గుర్తుంది, అది సాంఖ్యా దర్శనం. ప్రకృతి, పురుష వివేకాన్ని కలిగించడంలో ఈ దర్శనానికి మరే దర్శనం సాటిరాదు.

ఎవరికైనా సద్గురువు లభించడం అన్నది పూర్వజన్మ సుకృతమే. ప్రసిద్ధ దార్శనిక వేత్త, వైదిక ధర్మ ప్రచారకుడు, తెలుగునాట ‘ఆర్యసమాజ’ స్థాపకుడు అయిన పండిత గోపదేవ్ గురువు అనుగ్రహం లభించడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. అది 1995 ప్రాంతం. నేను అప్పటికి సికింద్రాబాద్‌లో, ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేస్తున్నాను. అప్పటిదాకా నాది నూటికి నూరు శాతం సాహిత్య రంగమే. తర్వాత ఆధ్యాత్మిక రంగం వైపూ దృష్టి సారించాను. ఆ సంవత్సరం ‘కళా ప్రపూర్ణ’ పండిత గోపదేవ శాస్త్రి ‘నూరో పుట్టిన ఏడాది’ వేడుక జరిగింది.

మరుసటి సంవత్సరమే ఆయన కాలధర్మం చెందారు. కానీ, ఈలోపే నాకు వారి దివ్యానుగ్రహం లభించింది. ఆ సంఘటన నా జీవితంలో మరిచిపోలేనిది. నూరేళ్ల ప్రాయానికి వచ్చిన గోపదేవ శాస్త్రి ఆజన్మ బ్రహ్మచారి. యోగనిష్ఠా గరిష్ఠుడు. 60 గ్రంథాల వరకు రచించాడు. అన్నిటికీ మించి గొప్ప దార్శనికుడు. వారి ‘శత సంవత్సర’ సభకు అప్పటి గవర్నర్ శ్రీకృష్ణకాంత్, ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు ముఖ్యఅతిథులు. వేలాదిమంది పాల్గొన్న ఆ సభలో నేను వ్యాఖ్యాతను. విశ్వవిద్యాలయ ఆచార్యుడనే ఉద్దేశ్యంతో నన్ను వ్యాఖ్యాతగా ఎన్నుకున్నారు. మూడు గంటలపాటు జరిగిన ఆ కార్యక్రమాన్ని నేను నా వాక్చాతుర్యంతో ప్రేక్షకులకు ఆకట్టుకొనే విధంగా మార్చాను. సభకు ముందు చాలా కాలం నుంచీ గోపదేవ శాస్త్రి మా కళాశాలకు సమీపంలోని నోముల స్వామిదాసు ఇంట్లో బస చేశారు.

స్వామిదాసు గోపదేవుల శిష్యుడు. సభ జరిగిన రెండు రోజుల తర్వాత, నాకు స్వామిదాసు నుంచి ఫోన్ వచ్చింది. “గురువుగారు మిమ్మల్ని చూస్తారట. మీరు వస్తారా? తనను రమ్మంటారా?” అని అడిగారు. “వీలైతే.. గురువుగారినే రమ్మనమండి. వారి రాకతో మా ఇల్లు పావనమవుతుంది” అన్నాను. వారాశిగూడలో వున్న మా ఇంటికి సికింద్రాబాద్ నుంచి వారు రావడానికి ఒక గంట పట్టింది. ఇంటి ముందు కారులోంచి దిగిన  గోపదేవ్ పండితులు, “నేను వస్తే మీ ఇల్లు పవిత్రమవుతుందని అన్నారట. అందుకే చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చాను” అని నాతో పలికారు. నేను అవునన్నట్టుగా తలూపి, వారికి స్వాగతం చెప్పి, సోఫాలో కూర్చోపెట్టాను.

గోపదేవ్ వారు దయానంద సరస్వతి అడుగుజాడల్లో నడుస్తూ, వేద ప్రచారం చేస్తున్న ఆర్య సామాజికుడు కదా! మా కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక గ్లాసు పాలు ఇస్తే తాగారు. అకస్మాత్తుగా అప్పుడు వారి నోటినుంచి వచ్చిన మాటలు నన్ను ఆశ్చర్య పరిచాయి.  “నేను ఒక సంవత్సరం కాలం నీకు దర్శనాలు బోధించాలనుకుంటున్నాను. నీకు కూడా ఇష్టమైతే రేపటి నుంచే పాఠం మొదలుపెడతాను. ఇంకా ఎక్కువ కాలం మీకు నేను వేదాంతం బోధించాలంటే దేవుడు ఆయుష్షు ఇవ్వాలి కదా!” అన్నారు. నా ఆనందానికి అవధులు లేవు. కోరి వచ్చిన అదృష్టంగా భావించాను. దర్శన పాఠాలు మొదలైనాయి.

కళాశాలలో నా అదృష్టం కొద్దీ క్లాసులు ఉదయం 8.30 నుంచి 12.30 వరకే జరుగుతాయి. ఆ తర్వాత పనేమీ ఉండదు. నేను ప్రతి రోజు గోపదేవులు బస చేస్తున్న నోముల స్వామిదాసు వారింటికి మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లి, సాయ్ంర తం ఆరుగంటల దాకా దర్శనాలు చదువుకొనే వాణ్ణి. అట్లా వెళుతున్న నాకు ఒకరోజు మరింత అరుదైన సంఘటనను ఎదురైంది. ఆ రోజు కళాశాలలో ఏదో కారణంగా విద్యార్థులు క్లాసులను బహిష్కరిం చారు. ఆ కారణంగా నేను ఉదయం తొమ్మిది గంటలకే గురువు దగ్గరకు వచ్చాను. ఆ ఇంటి వారప్పటికే ఆయనకు టిఫిన్ ఇచ్చి, తాము కూడా టిఫిన్ చేసి ఇంటికి తాళం వేసి, తమ పనుల మీద బయటికి వెళ్లి పోయారు, ఇంటి లోపల వారిని అలాగే వుంచి! గేటుకు తాళం మాత్రం వేయలేదు. 

మనసుంటే మార్గం వుండదా?

నేను లోపలకు ప్రవేశించి ఇంటికి తాళం వేసి ఉండడం గమించాను. గురువు లోపల వుండి వుంటారు కదా అనుకొని, పిలిచాను. వారు బయటి కిటికీకి సమాంతరంగా లోపల మంచం మీద పరుండిన ట్లుంది. నా కేకతో లేచారు. నన్ను చూస్తూ, “ఏం చెన్నప్పా! ఇవ్వాళ ఉదయాన్నే వచ్చా వు?” అని ప్రశ్నించారు. క్లాసులు బాయ్‌కాట్ అయిన సంగతి చెప్పాను. “చూశావుగా. వాళ్లు నన్ను వదిలి ఏదో పనుండి వెళ్లారు, తాళం వేసి! ఇప్పుడెలా? ఏం చేయాలనుకుంటున్నావు?” అని అడిగారు. “తాళం వేశారు కనుక లోపలికి రాలేను కదా. అందుకే, ఇవ్వాళ ఇంటికి వెళ్లి, రేపు మధ్యా హ్నం యథావిధిగా మీ సుముఖానికి వస్తా ను” అన్నాను.

దానికి వారు స్పందిస్తూ, “ఒకరోజు కాదు, ఒక గంటైనా అధ్యయనానికి అంతరాయం కలగడం నాకిష్టం ఉండదు. నన్ను నువు అర్థం చేసుకున్నావనుకుంటాను. ఈ రోజు కూడా నా పాఠం సాగాలం టే మార్గం లేకపోలేదు..” అన్నారాయన నిశ్చింతగా. “మీరు లోపల, నేను వెలుపల. పాఠం ఎలా సాగుతుంది గురువు గారు?” అని ప్రశ్నించాను. వారికి దివ్యదృష్టి ఉందని చెప్పలేను గాని, వారే అన్నారు. “ఈ గేటు లోపల ఎక్కడైనా ఒక కుర్చీ ఉంటే చూడు” అని. నేను పరిసరాలలో వెదికాను. ఆశ్చర్యంగా ఒక కాలు లేని మూడుకాళ్ల కుర్చీ గోడకు ఆనిచ్చి ఉండడం గమనించాను. అదే విషయాన్ని వారికి చెప్పాను. ఆయన సామాన్యుడు కాదుగా.

“మనిషికి రెండు కాళ్లే, చక్కగా నిలబడడానికి. కుర్చీకి నాలుగు కాళ్లవసరం లేదు. మూడుంటే చాలులే. దాన్ని నా కిటికీకి ఎదురుగా వేసుకొని కూర్చో. నీకేమీ కాదు” అన్నారు. నేను ఏ మాత్రం సంకోచించకుండా ఆ కుర్చీని కిటికీకి సమీపంలో వేసి, దానిపై జాగ్రత్తగా కూర్చున్నాను. ‘కుర్చీ బ్యాలెన్సు తప్పి, నేను కింద పడతానేమో’ అనే భయాన్ని దాదాపు విడిచిపెట్టేశాను. లోపల మంచం మీద కూర్చునే గోపదేవులు నాకు ఆ రోజు పాఠం చెప్పారు. మధ్యాహ్నం ఒంటిగంట దాకా విన్నాను. నాకు బాగా గుర్తుంది, అది సాంఖ్యా దర్శనం. ప్రకృతి, పురుష వివేకాన్ని కలిగించడంలో ఈ దర్శనానికి మరే దర్శనం సాటిరాదు. గోపదేవ్ పండితులు పాఠం పూర్తి చేశాక అన్నారు, “బస్.

ఈ రోజుకు చాలు”. ఆ మాటలు వినగానే నేను కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. అంతసేపు నాకే మాత్రం ఇబ్బంది కల్గనందుకు భగవంతుణ్ణి మనస్సులోనే కొనియాడాను. నేను నిలుచున్నానో లేదో అదే సమయంలో ఇంటివారు గేటు తెరచుకొని లోపలికి వచ్చారు. నన్ను చూసి, “ఏం చెన్నప్పగారూ! ఇప్పుడే వస్తున్నారా?” అని అడిగారు. ఆ మాటలు విన్న గోపదేవ్ పండితులు లోపలి నుంచే, “చెన్నప్ప ఉదయమే వచ్చాడు. ఇప్పటిదాకా పాఠమైంది. ఆయనను పోనిస్తే నేను విశ్రాంతి తీసుకుంటాను” అన్నారు. ఆ మాటలు విన్న ఇంటివారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. నేను మరొక మాట మాట్లాడకుండా స్కూటర్ ఎక్కి మా ఇంటికి బయలు దేరాను.

వ్యాసకర్త సెల్: 9885654381