calender_icon.png 24 August, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతన్నలకు భరోసా కల్పించండి

15-06-2024 12:05:00 AM

ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరనేత కార్మిక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. నేతన్నలు ఆకలి చావులకు గురౌతున్నారు. ఎన్నో వేల నేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ‘సిరుల’సిల్లగా వెలుగొందిన సిరిసిల్ల నేడు వీధినపడ్డ నేత కార్మికుల కుటుంబాలు, ఆకలి కేకలతో ఆత్మహత్యలకు దారితీసి ‘ఉరి’సిల్లగా మారుతున్నది. పూర్వం బతుకమ్మ చీరలు, మైక్రో, తమిళనాడు చీరలు, స్కూల్ యూనిఫార్మ్స్ ఆర్డర్లతో ఇప్పటి వరకు సుమారు మూడువేల కోట్ల విలువగల ఉత్పత్తులతో సిరిసిల్లా వెలుగొందింది. గత ప్రభుత్వం నిరుపేద కార్మికులను ఓనర్లుగా తీర్చిదిద్దే ప్రణాళికతో వర్క్ షెడ్స్ నిర్మించి వాటిలో కార్మికులకు ఉచితంగా పవర్లూమ్ అందించి, లేబర్ నుండి ఓనర్ గా మార్చే ప్రయత్నం చేసింది. నేడు నూతన ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నది. ఇప్పటికే అందాల్సిన బతుకమ్మ చీరల ఆర్డర్ అందలేదు.

మైక్రో, యూనిఫార్మ్ ఆర్డర్లు కూడా రాలేదు. వీటిపై ఎటువంటి జీవో విడుదల కాలేదు. అందవలసిన ముందస్తు పెట్టుబడులు అందలేదు. అప్పు చేసి నేసిన బట్టలు ప్రభుత్వం కొనడం లేదు. బతుకమ్మ చీరలు ఉంటాయా ఉండవా తెలియడం లేదు. నిలిచిపోయిన బకాయిలు చెల్లించడం లేదు. కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో సిరిసిల్ల ప్రజలపై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ నేత కార్మికులను వీధిపాలు చేయడం అన్యాయం. ఉపాధి లేక అప్పుల పాలైన కార్మికులు, ఆసాముల కుటుంబాలు ఆకల చావులకు దారి తీసే పరిస్థితి తలెత్తడం బాధాకరం. తక్షణమే ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపించాలి. 

 డాక్టర్ మోహనకృష్ణ భార్గవ, రాష్ట్ర వర్కింగ్ 

ప్రెసిడెంట్, పద్మశాలీ యువజన సంఘం, జనగామ జిల్లా